
ప్రాధాన్యం దక్కింది!
♦ పీసీసీలో జిల్లాకు పెద్దపీట
♦ సబిత, ప్రసాద్, చంద్రశేఖర్‌లకు చోటు
♦ డీసీసీ ఆశావహులకు ప్రమోషన్
♦ పీసీసీ కార్యవర్గంలోకి క్యామ మల్లేశ్
♦ కొత్త నేతకు డీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, మాగం రంగారెడ్డి సహా డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న డాక్టర్ ఏ చంద్రశేఖర్, క్యామ మల్లేష్‌కు పీసీసీ కార్యవర్గంలో స్థానం దక్కింది. ఉపాధ్యక్షులుగా సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, పి.నరసింహారెడ్డి, ఎం.రంగారెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా జెట్టి కుసుమ కుమార్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే టి.రామోహ్మన్‌రెడ్డిలను నియమించారు. శాశ్వత ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, క్యామ మల్లేష్, డాక్టర్ చంద్రశేఖర్ స్థానం దక్కింది. ఇక పీసీసీ సమన్వయ కమిటీలో జిల్లా నుంచి సర్వే, మాగంకు మాత్రమే అవకాశం లభించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యందక్కింది. శనివారం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ జంబో కార్యవర్గంలో మాజీ మంత్రులు, సీనియర్లకు అవకాశం కల్పించింది. నాయకుల అంతర్గత విభేదాలకు చెక్ పెడుతూ అధిష్టానం వ్యూహాత్మకంగా పదవుల పంపకం చేపట్టింది. డీసీసీపై పంతాలకు పోతున్న రెండు గ్రూపుల ముఖ్యనేతలకు పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడం ద్వారా.. డీసీసీ పీఠంపై నెలకొన్న వివాదానికి చెక్ పెట్టింది.
సరికొత్త నేతకు డీసీసీ పీఠం
జిల్లా కాంగ్రెస్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు అధిష్టానం తెరదించింది. పదవుల పంపకంలో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం డీసీసీ రేసులో ఉన్న మల్లేశ్, చంద్రశేఖర్, ప్రసాద్‌ను కూడా పీసీసీలోకి తీసుకోవడం ద్వారా ఈ పదవి కోసం పట్టుబడుతున్నవారిని వ్యూహాత్మకంగా తప్పించింది. ఈ క్రమంలోనే ఈ డీసీసీ పగ్గాలను కొత్త నేతకు కట్టబెట్టే దిశగా పావులు కదుపుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ క్యామ మల్లేశ్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించకుండా హైకమాండ్ పెండింగ్‌లో పెట్టింది. మల్లేశ్‌ను తప్పించాలని ఒకవర్గం.. మళ్లీ ఆయననే కొనసాగించాలని మరోవర్గం ఒత్తిడి తో రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో ఒత్తిడికి గురవుతోంది.
ఈ క్రమంలోనే మల్లేశ్ స్థానే చంద్రశేఖర్ పేరును పరిశీలించాలని మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ఢిల్లీస్థాయిలో లాబీయింగ్ నెరిపారు. చంద్రశేఖర్ వైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా మొగ్గు చూపారు. అయితే, జిల్లాలోని ముఖ్యనేతలు చంద్రశేఖర్ సారథ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి సబిత ఈ వ్యవహారంలో తటస్థ వైఖరినే అవలంబిస్తున్నా.. మిగతా నేతలు మాత్రం గత ఎన్నికల వేళ పార్టీలో చేరిన చంద్రశేఖర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడమేమిటనీ.. కాంగ్రెస్ భావజాలంలేని వ్యక్తికి డీసీసీ ఇస్తే సహించేదిలేదని ఏఐసీసీ పెద్దలకు తేల్చిచెప్పారు. ఒకవేళ సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పేరును పరిశీలించాలని సూచించారు.
దీంతో డీసీసీ అధ్యక్ష పదవి ప్రకటనను పక్కనపెట్టిన అధిష్టానం.. కొత్త ఎత్తుగడ వేసింది. ఇరు గ్రూపులకు ఆమోదయోగ్యుడైన మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేరును తెరమీదకు తెస్తోంది. ఈ క్రమంలోనే డీసీసీ పోస్టుకోసం పోటీపడ్డ ముగ్గురిని తప్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకొచ్చిన దిగ్విజయ్‌సింగ్ కూడా సుధీర్‌రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. సున్నిత మనస్కుడైన సుధీర్.. ఈ పదవిని చేపట్టేందుకు ముందుకు రాకపోతే సబిత తనయుడు కార్తీక్‌రెడ్డికి చాన్స్ ఇచ్చే అవకాశంలేకపోలేదు. అదేసమయంలో జిల్లా పీఠం కావాలని కోరిన ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు తెలిపాయి.