శిలాఫలకం తొలగింపులో వివాదం | Controversy over the removal of silaphalakam | Sakshi
Sakshi News home page

శిలాఫలకం తొలగింపులో వివాదం

Published Mon, May 22 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

శిలాఫలకం తొలగింపులో వివాదం

శిలాఫలకం తొలగింపులో వివాదం

మంగితుర్తిలో తీవ్ర ఉద్రిక్తత
పురుగు మందు తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే వర్మ తీరుపై మండిపడ్డ భక్తులు
పిఠాపురం రూరల్‌ : పిఠాపురం మండలం మంగితుర్తిలో ఓ రామాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం తొలగింపు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, అతడి అనుచరులు తీరుకు నిరసనగా గ్రామంలోని ఓ వర్గం భక్తులు సోమవారం ఆందోళనకు చేపట్టారు. శిలాఫలానికి తొలగిస్తే ఊరుకునేది లేదంటూ ఆలయం వద్ద నిరసన దిగారు. ఆందోళన కారులతో చర్చలు జరిపినా పోలీసులు  వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నాలు చేపట్టారు. దీంతో ఒక్క సారిగా మహిళా భక్తులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇంతలో ఆందోళనతో ఉన్న పేకేటి బేబి, యాళ్ల సత్యవతి, యాళ్ల దొరబాబులు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నేత అనుచరులపై ఆందోళన కారులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  స్థానిక టీడీపీ నేతలను అక్కడ నుంచి పంపి వేశారు. పురుగుల మందు తాగిన ముగ్గురుతో పాటు ఆందోళనల్లో సొమ్మసిల్లిన పేకేటి కాంతంను మొదట విరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి తదుపరి పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పేకేటి బేబి పరిస్థితి ఆందోళన కరంగా ఉండగా మిగిలిన ముగ్గురు కోలుకుంటున్నట్లు బాధితులు బంధువులు తెలిపారు. 
వివాదానికి కారణం శిలాఫలకమే 
మంగితుర్తి పల్లపు వీధిలోని రామాలయం శిథిలావస్థకు చేరడంతో స్థానిక నేత బొంతల గంగాధర్‌ అలియాస్‌ పేకేటి బాబు ఆలయ పుననిర్మాణానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా అప్పటి కేంద్ర టూరిజం శాఖ మంత్రి, సినీనటుడు చిరంజీవి ఆశ్రయించడంతో  ఆలయ అభివృద్ధికి పర్యాటకు అభివృద్ధి సంస్థ ద్వారా రూ. 10.49 లక్షలు నిధులను మంజూరు చేశారు.  ఈ నిధులతో 2014లో పనులు ప్రారంభించగా ఇటీవలే ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కాగా నిధులు ఆలయ సరిపడకపోవడంతో రామాలయంలోని విగ్రహాలు, ప్లోర్‌ టైల్స్‌కు బాబు కొంత మొత్తాన్ని హెచ్చించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ముఖద్వారం వద్ద బాబు తన తల్లిదండ్రుల పేరిట శిలాఫలకాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం గుడి నిర్వాహణను సైతం అనధికారికంగా స్థానిక ఆలయ కమిటీకి అప్పగించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆలయానికి బాబు తన తల్లిదండ్రుల పేరిట శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం అవమానంగా బావించి కక్ష్య సాధింపుకు దిగారు. టూరిజం శాఖ ఏఈ కృష్ణతో బాబుపై పిఠాపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేయించారు. వివాదానికి కారణమైన శిలాఫలకాన్ని పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు. కొత్త శిలాఫలకాన్ని వెంట తెచ్చుకున్న అధికారులు గ్రామంలో ఉత్రిక్తత పరిస్థితులు ఉండడంతో దానిని తిరిగి తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యేతో చేయించాల్సిన రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం వాయిదా వేసినట్లు ప్రకటించారు. 
పోలీసు పికెట్‌ ఏర్పాటు 
గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉండడంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసినట్టు  రూరల్‌ ఎస్సై వి.కోటేశ్వరరావు తెలిపారు. అలాగే ఆత్మాహత్యాయత్నం పాల్పడిన ముగ్గురితో పాటు అధికారుల విధులకు ఆటంకపర్చిన మరో ఐదుగురుపైనా వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.  పిఠాపురం సిఐ పి.అప్పారావు, ఎస్సైలు శోతభన్‌బాబు, మూర్తి, రాందాసు, సత్యనారాయణ, శివకృష్ణ, టూరిజం శాఖ ఈఈ శ్రీనివాసరావు, డీఈ సత్యనారాయణ, ఏఈ కృష్ణ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిలాఫలక తొలగింపు పనులను పర్యవేక్షించారు. 
బాధితులకు అండగా వైఎస్సార్‌ సీపీ 
శిలాఫలకం తొలగింపు వివాదంలో పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నేత పెండెం దొరబాబు పిఠాపురం ఆస్పత్రిలో పరామర్శించారు. వివాదానికి కారణమైన శిలాఫలక స్థలాన్ని ఆయన సోమవారం సాయంత్రం పరిశీలించారు.  ఎమ్మెల్యే వర్మ నియంతపోకడలవల్లే ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. టూరిజం శాఖ అధికారులు తమ శాఖ ద్వారా శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆలయానికి సుమారు రూ. 4 లక్షలు సొంత నిధులు హెచ్చించిన దాత పేకేటి బాబు తల్లిదండ్రుల పేరిట శిలాఫలకాన్ని తొలగించిన వారే తిరిగి ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తే వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో దాత తరపున శిలాఫలకం ఏర్పాటు చేస్తామని ఆయన  హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యదర్శి గండేపల్లి బాబి, వైఎస్సార్‌ సీపీ నేతలు కర్రి ప్రసాద్, బొజ్జా పెదకాపు, ఉలవల భూషణం, బత్తిన ప్రకాష్, కసిరెడ్డి అక్కయ్య తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement