ధర్మారావు మృతితో రోదిస్తున్న ధర్మారావు తల్లిదండ్రులు.
పేద కుటుంబంలో విషాదం
Published Tue, Aug 2 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఉపాధి కోసం సొంత గ్రామాన్ని కాదని తల్లిదండ్రులను, బిడ్డలను కాదని భార్యతో హైదరాబాద్ వెళ్తే అక్కడ మృత్యువు భర్తను కాటేసింది. భార్య గాయాల పాలైంది. దీంతో వృద్ధులైన తల్లిదండ్రులు తాము ఎలా బతికేదని తమ మనవరాళ్లను ఎలా పెంచేదని రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మంగళవారం నిర్మాణంలో ఉన్న భవనం కూలి మృతి చెందిన వారిలో జింకిభద్రకు చెందిన ధర్మారావు ఉన్నాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళ్తే...
సోంపేట : జింకిభద్ర గ్రామానికి చెందిన వలస కార్మికుడు మామిడిపల్లి ధర్మారావు కుటుంబంలో మంగళవారం విషాదం అలుముకుంది. ధర్మారావు కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం స్వగ్రామాన్ని విడిచి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే కొన్నాళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో ధర్మారావు(45) భవన నిర్మాణ కార్మికుడిగా విధులు నిర్వíß స్తూ, మంగళవారం భవనం కూలిన ఘటనలో మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ధర్మారావు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జింకిభద్ర గ్రామానికి చెందిన నారాయణ, రాజులమ్మ కుమారుడైన మామడిపల్లి ధర్మారావు తల్లిదండ్రులను, కన్నబిడ్డలను పోషించడానికి పొట్ట చేత పట్టుకుని భార్యతో కలసి హైదరాబాద్ వలస కార్మికుడిగా వెళ్లాడు. కొద్ది సంవత్సరాలుగా వలస కార్మికునిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉంటే వచ్చిన వేతనం సరిపోదని, వృద్ధ తల్లిదండ్రులను జింకిభద్ర గ్రామంలో విడిచి పెట్టాడు. కన్న బిడ్డలైన సాయి(11), నవ్య (8) లను వారి తాతగారు గ్రామమైన బెండిలో విడిచిపెట్టి చదివిస్తున్నాడు. సాయి 6వ తరగతి, నవ్య 3వ తరగతి చదువుతున్నారు. జూలై నెలలో జింకిభద్ర గ్రామంలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. 15 రోజుల కిందటే హైదరాబాద్‌కు మళ్లీ ధర్మారావు తన భార్యతో వెళ్లాడు.ఇంతలోనే విధి వెక్కిరించింది. వారు పనులు చేస్తున్న భవనం కూలడంతో ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. బతుకు తెరువు కోసం సొంత గ్రామాన్ని వీడి హైదరాబాద్ వెళ్తే అక్కడ మృత్యువు వెంటాడి చంపేసిందని ధర్మారావు తల్లిదండ్రులు నారాయణ, రాజులమ్మ రోదిస్తూ చెప్పారు. తాము ఎలా బతికేదని వారు రోదిస్తున్నారు. సంఘటన విషయం తెలిసి గ్రామమంతా విషాదం నెలకొంది.
Advertisement
Advertisement