ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు
– కలశ స్థాపనతో ప్రారంభం
– సోమవారం నుంచి గ్రామసేవలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో దసరా పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేదమంత్రాల నడుమ శనివారం ఉదయం సత్యసాయి మహాసమాధి వద్ద విజయదశమి కలశ స్థాపనతో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వేడుకలు ప్రారంభించారు. ప్రతి ఏటా విజయదశమి వేడుకలను పురష్కరించుకుని ప్రశాంతి నిలయంలో వేదపురుషసప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ సారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
వేడుకలలో భాగంగా 3వ తేదీ నుంచి సత్యసాయి గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వేలాది మంది సత్యసాయి భక్తులు దేశవిదేశాల నుంచి పుట్టపర్తి చేరుకున్నారు. సోమవారం నుంచి తొమ్మిది రోజులు పాటు పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన 60 వేల కుటుంబాలకు సత్యసాయి అన్నప్రసాదాలు, నూతన వస్త్రాలు అందజేయనున్నారు. తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో సత్యసాయి గ్రామసేవలు చేపట్టే వారికి ప్రజలు సహకరించాలని ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు కోరారు.
అలరించిన అంబరీష్ విజయం నాటిక
వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద రాజమండ్రికి చెందిన శ్రీ సత్యసాయి గురుకులం విద్యార్థులు నిర్వహించిన ‘అంబరీష్ విజయం’ నాటిక భక్తులను అలరించింది. నాటికలో నారాయణుడు, నారద మహర్షి మధ్య సంభాషణా ఘట్టాన్ని విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. భక్తులకు చక్కటి సందేశాన్నిస్తూ సుమధుర స్వరాలొలికిస్తూ నిర్వహించిన నాటికతో భక్తులు పరవశించిపోయారు.