పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది
- అమర వీరుల దినోత్సవంలో డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు
మెదక్: అటవీశాఖ అధికారులకు పూర్తిస్థాయి రక్షణ లేదని, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి హక్కులను తమ శాఖకు అప్పగిస్తే బాగుంటుందని మెదక్ డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు. ఆదివారం అటవీశాఖ అమర వీరుల దినోత్సవాన్ని స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో అమర వీరులను స్మరించుకుంటూ ర్యాలీని నిర్వహించారు.
ఉద్యోగ నిర్వహణలో అమరుల కుటుంబీకులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పాపన్నపేట మండలంలోని ఓ గ్రామంలో అటవీశాఖ అధికారులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఏమీ చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఇందుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కులంపేరుతో దూషించారంటూ మళ్లీ తమ అధికారులపైనే ఫిర్యాదులు చేశారన్నారు. అడవులను ఎవరు ఆక్రమించినా, తమ అనుమతి లేకుండా ఎవరు అడవిలోకి వెళ్లినా వారిపై చర్యలు తీసుకునే పూర్తిస్థాయి హక్కులను తమకు అప్పగిస్తే బాగుంటుందన్నారు.
గతంలో అనేక మంది అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు, అక్రమ కలప వ్యాపారులు దాడులు చేసి చంపిన సంఘటనలు ఉన్నాయని, 2013లో నారాయణ ఖేడ్‌లో విధులు నిర్వహిస్తున్న బీట్ ఆఫీసర్ శివలాల్‌ను దారుణంగా హత్యచేసి పెట్రోల్‌పోసి చంపారన్నారు. అలాంటి అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నారు. ఆయన వెంట రేంజ్ ఆఫీసర్లు చంద్రశేఖర్, బర్నోబ తదితరులు ఉన్నారు.