ఆ హామీ ఏమైంది?
Published Wed, Nov 30 2016 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాంట్రాక్టు లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హమీలు ఏమయ్యావని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన వైఎస్‌ఆర్ సీపీ నేతలు వారికి పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల ఆవేదనలో న్యాయం ఉందన్నారు.
ఎంతో సహనం, ఓర్పుతో ఇన్నాళ్లు ఉన్నారని, వీరి డిమాండ్ల పరిష్కారంతో ప్రభుత్వకి నష్టం ఉండదన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వాలు మూడు దశల్లో వీరికి న్యాయం చేస్తూ కొంత భద్రత కల్పించుకుంటూ వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వం కూడా పదో వేతన సవరణతో పాటు జీతాలు పెంచాల్సి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మేరకు వీరందరినీ క్రమబద్ధీకరణ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ముఖ్యమంత్రి ఖాతరు చేయకపోవడం దారుణమన్నారు.
16 ఏళ్లుగా సేవలు చేరుుంచుకొని ఇప్పటికీ రెగ్యులర్ చేయకపోతే ఈ వర్గాన్ని కూడా చంద్రబాబు మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. అశలు పెట్టడం, తరువాత ఆర్థిక పరిస్థితి బాగోలేదని మోసపూరిత మాటలు చెప్పడం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమాలన్నీ కిరికిరి (జన్మభూమి) కమిటీలకు అప్పజెప్పారని, కలెక్టర్, ఉన్నతాధికారులు సైతం పేదవాడికి పింఛను మంజూరు చేసే స్థితిలో లేరన్నారు. అధికారులు చేయలేక, లబ్ధిదారులను కిరికిరి కమిటీల వద్దకు వెళ్లాలని చెబుతున్నారని.. ఆ మాటలు చెప్పేందుకు ఐఏఎస్ అధికారి అవసరం లేదని క్లర్కు చాలన్నారు.
ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు
పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకొనే పరిస్థితి జిల్లాలో లేదని ధర్మాన అన్నారు. మద్దతు ధర లేక బస్తా రూ. 800 చొప్పున దళారులకు అప్పగించాల్సిన దయానీయ పరిస్థితి ఉందన్నారు. పనికి మాలిన కార్యక్రమాలకు కొట్లాది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు మేధావుల బతుకు తెరువుకు ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. రానున్న బడ్జెట్ సమావేశంలో ఈ ప్రస్తావనను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీసుకువచ్చేలా ఆయన దృష్టికి తీసుకెళ్తానని కాంట్రాక్టు లెక్చరర్లకు హామీ ఇచ్చారు. అలాగే జగన్‌ను కలిసేందుకు సహకరిస్తానన్నారు.
మేధావులకు గౌరవం లేదు:రెడ్డి శాంతి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జాతి గర్వపడే ఉద్యోగంలో ఉన్న మేధావులకు ఈ రాష్ట్రంలో కనీస గౌరవం లేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ పద్మావతి, పార్టీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు పైడి మహేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్రప్రసాద్, పొందూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.సారుుకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి కామేశ్వరి, నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, మండవల్లి రవి, శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షుడు సాధు వైకుంఠరావు పాల్గొన్నారు.
వచ్చే నెల 2న చలో విజయవాడ
కాంట్రాక్టు లెక్టరర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదన్నారు. వచ్చే నెల రెండో తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. ధర్నాలో సంఘ ప్రతినిధులు కె.ఎస్.యాదవ్, హనుమంతు రాంమోహన్ దొర, కె.నర్సింగరావు, ఐ.వేణుగోపాలరావు, చౌదరి నగేష్, డి.లక్ష్మున్నాయుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement