జగన్నాథపురంలో పారిశుద్ధ్యం దుస్థితి
కేజీహెచ్‌లో కోమాలో ఉన్న బాధిత యువకుడు...
పార్వతీపురం : జిల్లాను అతలాకుతలం చేస్తున్న డెంగీ ప్రస్తుతం పార్వతీపురాన్ని తాకింది. మండలంలోని జగన్నాథపురం ఒకటో వార్డు కష్ణా కాలనీకి చెందిన 19 ఏళ్ల చుక్క సాయికి డెంగీ సోకినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట జ్వరంతో బాధపడిన సాయిని అతని తండ్రి రామారావు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు యువకుడ్ని పరిశీలించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఆ యువకుడ్ని విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే కోమాలోకి చేరుకున్నట్లు సమాచారం. అక్కడ నుంచి సాయిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సాయిని పరీక్షించి డెంగీ లక్షణాలున్నట్లు చెప్పారని తెలిసింది.
అధ్వానంగా పారిశుద్ధ్యం
జగన్నాథపురంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్లే డెంగీ లాంటి జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడే చెత్తా,చెదారాలు పేరుకుపోవడం, కాలువలు మురుగుతో నిండిపోయి ఉన్నాయని చెబుతున్నారు.
ఫలితం లేదు– ముత్యాల ఉష, వార్డు కౌన్సిలర్
వార్డులో పారిశుద్ధ్యం క్షీణించిందని, వెంటనే పనులు చేపట్టాలని గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి.
విజంభిస్తున్న దోమలు– ఇజ్జాడ శ్యామల, దూబగడ్డవీధి
పగలు, రాత్రి అనే తేడా లేకుండా దోమలు విజంభిస్తున్నాయి. దీంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే కాలనీలో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు.
పట్టించుకోలేదు...రాగోలు లక్ష్మణ, జన్మభూమి కమిటీ సభ్యులు
వార్డు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు అస్సలు సమస్యలు వినడం లేదు. దీంతో జగన్నాథపురంలో ఇబ్బందుల తలెత్తుతున్నాయి.