పోలీసుల వలయంలో డోన్
- టీడీపీ వర్గీయుల దౌర్జన్యకాండ నేపథ్యంలో భారీ బందోబస్తు
- క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం
డోన్ టౌన్: డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం టీడీపీ వర్గీయులు సాగించిన దౌర్జన్యకాండ నేపథ్యంలో శనివారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మున్సిపల్ వేలాల సందర్భంగా టీడీపీ నాయకులు చర్చల పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను బయటకు పిలిచి కత్తులు, ఇనుప రాడ్‌లు, కర్రలతో దాడి చేయగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కూడళ్లు, మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, జయశేఖర్, రామసుబ్బయ్యలతో పాటు పలువురు ఎస్‌ఐలు బందోబస్త్‌ను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా టీడీపీ దౌర్జన్యకాండను కళ్లారా చూసిన పాతపేట వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందేమోనని భయాందోళన చెందుతున్నారు.