డిజిధన్‌ అదుర్స్‌ | digidhan held in nizambad | Sakshi
Sakshi News home page

డిజిధన్‌ అదుర్స్‌

Published Fri, Feb 24 2017 7:27 PM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM

డిజిధన్‌ అదుర్స్‌ - Sakshi

డిజిధన్‌ అదుర్స్‌

60కి పైగా స్టాళ్ల ఏర్పాటు
డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన
ఉద్యోగులు, విద్యార్థులతో కిటకిట


నిజామాబాద్‌ అర్బన్‌ /ఇందూరు :

జిల్లా కేంద్రంలో డిజిటల్‌ చెల్లింపులపై నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిధన్‌ మేళా–2017 విజయవంతమైంది. బుధవారం శ్రీరామ    గార్డెన్‌లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి   ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలు భారీగా     తరలివచ్చారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్, నీతి ఆయోగ్‌ డైరెక్టర్‌ జుగల్‌ కిశోర్‌ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్‌ చెల్లింపుల అవగాహన కార్యక్రమంలో 60కి పైగా వివిధ స్టాళ్లు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకులు ఈ మేళాలో పాల్గొన్నాయి. అలాగే ప్రైవేటు రంగ సంస్థలు వ్యాపార సేవలను వివరించాయి. ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానం, నగదు రహిత లావాదేవీలను వివరించారు. గార్డెన్‌లోని వేదిక వద్ద, ఆరుబయట ప్రాంతాల్లో స్టాళ్లు ఏర్పాటు చేశారు. నేరుగా వచ్చి స్టాళ్లలో నగదు రహిత లావావీలను తెలుసుకుని వెళ్లేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటితోపాటు ప్రభుత్వ శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేసి శాఖ తరఫున కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ వైద్య సేవలు, వైద్య ఆరోగ్య శాఖ తరఫున వ్యాధులకు సంబంధించి ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ఆధార్‌ కార్డు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేసి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరవడం, ఆధార్‌ అనుసంధానం, ఏటీఎం కార్డుల అందజేత, వివిధ మొబైల్స్‌కు సంబంధించిన సిమ్‌ కార్డుల విక్రయాలు, స్మార్ట్‌ ఫోన్‌లలో డిజిటల్‌ చెల్లింపునకు సంబంధించిన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి అవగాహన కల్పించారు. అదే విధంగా కూరగాయలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, రేషన్‌ దుకాణాలు, మీ సేవ, క్యాంటీన్‌లు, జన ఔషధ కేంద్రాలు, గ్యాస్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళ సంఘాల ఆధ్వర్యంలో రెండు స్టాళ్ల ఏర్పాటు నగదు రహిత చెల్లింపుల రూపంలో ప్రూట్స్‌ను విక్రయించారు. వివిధ సంఘాలకు చెందిన మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, జిల్లా నలు మూలల నుంచి తరలివచ్చారు. వీరికి తోడు నగరంలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రావడం మేళా సందడిగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు వివిధ చోట్ల బాధ్యతలను నిర్వర్తించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
డిజిధన్‌ మేళాలలో తిరుమల నర్సింగ్‌ కళాశాల, కాకతీయ కళాశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు చెందిన విద్యార్థుల నృత్యాలు అలరించాయి. అష్ట గంగాధర్, మరి కొందరు గాయకులు పాటలు పాడారు. నగదు రహితానికి కృషి చేసిన వారికి అవార్డులు జిల్లాలో నగదు రహిత లావాదేవీలకు కృషి చేసిన వారికి కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ అవార్డులు అందించారు. ఈ అవార్డులను అందుకున్న వారిలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్, డీపీఓ కృష్ణమూర్తి, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాములు, జనరల్‌ ఆసుపత్రిలో ఈ–ఆసుపత్రి ఇన్‌చార్జి భన్సీలాల్, ఈ–సేవ ఏఓ రమణారెడ్డి, ఈ–డిస్ట్రిక్‌ మేనేజర్‌ కార్తీక్, ఈ– పంచాయతీ డీపీఎం నరహరి, డిప్యూటీ తహసీల్దార్‌ సుభాష్‌చందర్, ఏపీఎం మానిక్‌రెడ్డి, డీఆర్వో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ వేణు ఉన్నారు. అలాగే, అంకాపూర్‌ సర్పంచ్‌ పుష్ప, బస్సాపూర్‌ సర్పంచ్‌ లింగస్వామీ, మాడవండి కుర్ధు సర్పంచ్‌ రాజు, కొండూర్‌ సర్పంచ్‌ ఆశోక్, జలాల్‌పూర్‌ సర్పంచ్‌ సాయిలు, మనోహరబాద్‌ సర్పంచ్‌ తిరుపతి ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులలో భాగంగా అకాంపూర్‌ కార్యదర్శి సుభాష్‌చంద్రబోస్, ఎర్రాజ్‌పల్లి సద్గుణ, తుంగిని సందీప్, లోలం మధుకర్, సుదద్దపల్లి సంతోష్‌రెడ్డిలు ఉన్నారు. అలాగే బ్యాంకు అధికారులు సాయికుమార్‌ (ఎస్‌బీఐ), గంగాధర్‌ (ఆంధ్రాబ్యాంక్‌), సరిత (ఇండియన్‌ బ్యాంక్‌),  అనంతలక్ష్మి (ఎస్‌బీఐ), శ్రీనివాస్‌ (సిండికేట్‌ బ్యాంక్‌) ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement