బాలచంద్ర ప్రస్థానం ఆదర్శనీయం
బాలచంద్ర ప్రస్థానం ఆదర్శనీయం
Published Thu, Aug 4 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
గుంటూరు ఈస్ట్ : నాటకరంగానికి 50 సంవత్సరాలు విశేష సేవలందించిన బాలచంద్రరావు కళా ప్రస్థానం మరింత ఉన్నతంగా సాగాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆకాంక్షించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖ నటులు ,దర్శకులు , విశ్వశాంతి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఎమ్ .బాలచంద్రరావు నాటక రంగంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సత్కార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్యేల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కళలను పాఠ్యాంశాలలో చేర్చి మార్కులు కేటాయిస్తేనే వాటికి ఆదరణ లభిస్తుందన్నారు. కళలను పరిరక్షించాలని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
అమరావతి ఆర్ట్స్ అధ్యక్షుడు కావూరి సత్యనారాయణ మాట్లాడుతూ నాటక రంగం సమాజం కోసమే పాటుపడిందని అటువంటి ఉన్నతమైన రంగంలో 50 సంవత్సరాలు కృషి చేయడం గొప్ప విషయమన్నారు. బాలచంద్రరావు తమ సంస్థ ద్వారానే కాక ఇతర సంస్థలకు ఎంతో సహకారాన్ని అందించి నాటక రంగానికి ఎనలేని సేవలు చేసారన్నారు. తొలుత ప్రముఖ నాట్యకళాకారిణి కోకా విజయలక్ష్మి , కె.సాయిమంజీర, మోహన శృతి కీర్తన సాంప్రదాయ నృత్యం చేసి అలరించారు. అట్ల రామకృష్ణారెడ్డి దుర్యోదనుడు ఏకాపాత్రాభినయంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. బొబ్బిలి యుద్ధంలోని బుస్సీ ఘట్టాన్ని ప్రదర్శించారు. ఎమ్.బాలచంద్రావు దంపతులను అమరావతి ఆర్ట్స్ ఇతర నాటక సంస్థల ఆధ్వర్యంలో బంగారు కడియం, గొలుసు, మోమెంటోలతో సత్కరించారు. సభకు నటులు దర్శకులు ఎమ్‌విఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. పారిశ్రామిక వేత్త కళ్లం హరినాథరెడ్డి, కారుమూరి సీతారామయ్య, నూతలపాటి సాంబయ్య, సిరిగిరి సాంబశివరావు, వంగల సుందరరామిరెడ్డి, ఆలయ చైర్మన్ సి.హెచ్.మస్తానయ్య, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
Advertisement