ప్రేమ, ఆప్యాయత.. మిస్సింగ్‌ | distance hike between parents and children | Sakshi
Sakshi News home page

ప్రేమ, ఆప్యాయత.. మిస్సింగ్‌

Published Thu, Jul 20 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

ప్రేమ, ఆప్యాయత.. మిస్సింగ్‌

ప్రేమ, ఆప్యాయత.. మిస్సింగ్‌

- తీరిక లేకుండా గడుపుతున్న తల్లిదండ్రులు
- మంచీచెడు బోధించడంలో వైఫల్యం
- కనీస పర్యవేక్షణ కరువు
- పెడతోవ పడుతున్న పిల్లలు
- క్షణికావేశంతో బంగారు భవిష్యత్తు నాశనం


- తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి ఉదంతం యావత్‌ దేశాన్ని ఆలోచనలో పడేసింది. సినిమాల మోజులో 40 రోజుల క్రితం ఇల్లు విడిచిన ఈ బాలిక పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల ఆశలను కాలరాస్తూ.. ఎంచుకున్న లక్ష్యానికి ప్రాధాన్యతనిస్తూ పూర్ణిమ తీసుకున్న నిర్ణయం ఆ వయస్సు పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

- జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈనెల 10న అదృశ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు ఆమెను తిరిగి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారంతోనే వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

అదృశ్యం కేసులు ఇలా..
సంవత్సరం     మొత్తం కేసులు    మహిళలు    మైనర్‌ బాలికలు     
2015                375               124               151    
2016                455               277               178    
2017                360               135               125

కుటుంబ గొడవలు.. క్షణం తీరిక లేని జీవనం.. ఉద్యోగ బాధ్యతలు.. వ్యాపారం.. వ్యాపకం ఏదయినా పిల్లలతో గడిపే సమయం క్రమంగా తగ్గిపోతోంది. నాలుగు గోడల మధ్య చదువులు.. ర్యాంకుల వేట.. దిశానిర్దేశం చేసే పెద్దరికం లేకపోవడం.. మంచీచెడులు తెలుసుకోలేని మానసిక సంఘర్షణలో సాంత్వన కలిగించే గొంతుక ‘తప్పు’టడుగు వేయిస్తోంది. కళ్ల ముందు కనిపించే రంగుల ప్రపంచం వైపు తీసుకెళ్లే జీవితం తెగిన గాలిపటంగా మారుతోంది. ఆ తర్వాత తేరుకున్నా.. వేలెత్తి చూపే సమాజం, అనుమానంతో చూసే కుటుంబం.. ఆత్మహత్యలకు పురిగొలుపుతోంది. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య పెరుగుతున్న అంతరం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.

అనంతపురం సెంట్రల్‌ : ప్రపంచం చేతిలో ఇమిడిపోతోంది. సినిమాలు.. ఇంటర్నెట్‌ ప్రభావం పిల్లలపై పెను ప్రభావం  చూపుతున్నాయి. తెలిసీ తెలియని వయస్సులో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను బుగ్గి చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల నమోదువుతున్న మిస్సింగ్‌ కేసుల్లో అధిక శాతం మైనర్‌ బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరి వయస్సు 15 నుంచి 18 సంవత్సరాల్లోపు ఉండటం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి ఉరుకులు పరుగుల జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ.. ఆదాయ సముపార్జనకే అధిక సమయం  కేటాయిస్తుండటంతో పిల్లలతో గడిపే సమయం క్రమంగా తగ్గిపోతోంది.

పిల్లల చదువు ఎలా సాగుతోంది? రోజు ఎలా గడిచింది? అనే విషయాలపైనా దృష్టి సారించలేని పరిస్థితి ఉంటోంది. పిల్లలతో ప్రేమగా మాట్లాడటం.. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం.. కనీసం చిన్న చిన్న సంతోషాలను అందివ్వలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. రోజులో అరగంట కూడా పిల్లలతో గడపని తల్లిదండ్రులు వేలల్లోనే. కనీసం చెప్పింది  వినే ఓపిక కూడా లేకపోతోంది. నా సమస్యలే నాకు ఎక్కువగా ఉన్నాయని.. మధ్యలో నీ పోరు ఏంటని విసుక్కోవడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో తల్లిదండ్రుల మధ్య సఖ్యత కొరవడి చోటు చేసుకునే గొడవలు కూడా పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలు దారితప్పుతున్నారు.

ఆకతాయిల గాలం
కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకు దూరమవుతున్న బాలికలు ఎక్కువ సమయం కేటాయించే ఆకతాయిలకు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కాలంలో బాలికల అదృశ్యం కేసులను పరిశీలిస్తే ఇదే విషయం వెల్లడవుతోంది. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనవుతూ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అప్పటికే వివాహమైన వ్యక్తులను, అల్లరిచిల్లరగా తిరిగే యువకుల మాయలో పడి తల్లిదండ్రుల కలను చిదిమేస్తున్నారు.

- నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న విద్యార్థి ఆటోడ్రైవర్‌తో ప్రేమలో పడింది. పాఠశాల ఎదురుగా ఆటోస్టాండ్‌లో ఉంటున్న సదరు వ్యక్తి ఆ అమ్మాయిని మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఇతనికి గతంలోనే వివాహమైంది. ఇలా.. కొంతకాలానికి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఆ బాలిక ఇల్లు చేరింది.
 
- నగరంలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె ఇటీవల ఓ ఆకతాయితో వెళ్లిపోయింది. పుట్టపర్తిలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకొని నెలరోజుల పాటు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఒక రోజు బాలికను అర్ధరాత్రి నగరానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత ఆకతాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లల మనసెరిగి నడుచుకోవాలి
ఇటీవల జిల్లాలో మైనర్‌ బాలికల అదృశ్యం కేసులు అధికమయ్యాయి. ఇందులో ప్రేమ వ్యవహారాలే అధికంగా ఉంటున్నాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు మనసెరిగి నడుచుకోవాలి. తప్పు చేస్తున్నట్లు తెలిస్తే సున్నితంగా హెచ్చరించాలి. అవసరమైతే స్నేహితులు, ఇష్టమైన వ్యక్తులతో చెప్పించాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ప్రవర్తనను ఓ కంట కనిపెట్టి తల్లిదండ్రులకు సమాచారం చేరవేయాలి. మైనర్‌ బాలికలు ఇష్టపూర్వకంగా వెళ్లినా.. అందుకు కారణమైన అవతి వ్యక్తులపై చర్యలు తప్పవు.
- జీవీజీ అశోకుమార్, జిల్లా ఎస్పీ

నైతిక విలువలు నేర్పాలి
తల్లిదండ్రులతో విభేదించడం.. మితిమీరిన కోపం.. లగ్జరీకి అలవాటు పడడం.. ఇవన్నీ ‘కాండక్ట్‌ డిజార్డర్‌’ కిందకు వస్తాయి. 8 నుంచి 12 ఏళ్ల మధ్యలోనే ఈ సమస్య ప్రారంభమవుతుంది. ఆ వయస్సులో అడిగినవన్నీ సమకూర్చడం.. అతి గారాబం చేయడంతో 18 ఏళ్ల వయస్సుకు అది ఎక్కువవుతుంది. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమపూర్వకంగా మెలగాలి. ఎక్కువ సేపు వారితో గడపాలి. పిల్లల ఎదుట గొడవ పడకూడదు. మంచీచెడు నేర్పించాలి. ఎవరితో తిరుగుతున్నారో గమనించాలి.
- ప్రొఫెసర్‌ డాక్టర్‌ యెండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, సర్వజనాస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement