ఉద్యోగమా? ప్రాక్టీసా..? తేల్చుకోండి
– విధి నిర్వహణలో అలసత్వం వద్దు
– అందరూ సమయపాలన పాటించాలి
– సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్
(సాక్షి ఎఫెక్ట్)
అనంతపురం మెడికల్ : ‘ఉద్యోగం చేయడమా లేక ప్రైవేట్ ప్రాక్టీసా చేసుకోవడమో మీరే తేల్చుకోండి. ఇక్కడ పని చేస్తూ నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు’ అని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ వైద్యులను హెచ్చరించారు. ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన ఇబ్రహీం ఎద్దులబండి నుంచి పడి గాయపడగా సర్వజనాస్పత్రికి తెస్తే సర్జికల్ వార్డు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి పంపించేసిన విషయం తెలిసిందే. చివరకు బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ క్రమంలో ‘ఇదేం సర్కారు వైద్యం’, బో‘ధనాస్పత్రి’, ‘మెడికల్ మాఫియా’ శీర్షికలతో ఆస్పత్రి వైద్యసేవలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో బుధవారం సర్జికల్ వైద్యులతో సూపరింటెండెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ఇబ్రహీం విషయంలో జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకూడదన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఓపీ, వార్డుల్లో డ్యూటీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తే సంబంధిత హెచ్‌ఓడీదే బాధ్యతన్నారు. ఒకవేళ హైరిస్క్ కేసులు వస్తే ఆ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పి వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపీ చీటీలు ఇస్తారని, వైద్యులు 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీల్లో ఉండాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ వైవీ రావు, సర్జికల్ హెచ్‌ఓడీ డాక్టర్ రామస్వామినాయక్, వైద్యులు నారాయణస్వామి, శివశంకర్‌నాయక్, మనోహర్, రాజేశ్, నిర్మల, రమాబాయి తదితరులు పాల్గొన్నారు.