‘ఓపి’క నశిస్తోంది
హిందూపురం టౌన్ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల ఓపిక నశిస్తోంది. శనివారం ఓపి (ఔట్ పేషెంట్స్)కి చిన్నపిల్లల విభాగానికి సంబంధించి వందల సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలను వైద్యం కోసం తీసుకువచ్చారు. అయితే వైద్యులు ఉదయం 11 గంటలైనా రాకపోవడంతో చిన్నారులు, రోగులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి బయటి రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అందులోను చిన్నారులు మరి ఎక్కువగా వస్తారు.
అయితే ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు ముగ్గురే ఉన్నారు. వారిలో ఒకరు సెలవులో ఉన్నారు, మరొక డాక్టర్ అత్యవసర విభాగంలో విధుల్లో ఉన్నారు. దీంతో వందల సంఖ్యలో రోగులు బారులు తీరారు. కాగా డాక్టర్ కేశవులు ఒక్కరే అందరికీ వైద్య సేవలు అందించారు.