ద్రాక్షారామలో ఉద్రిక్తత | draksharama dalitha darna | Sakshi
Sakshi News home page

ద్రాక్షారామలో ఉద్రిక్తత

Published Fri, Oct 14 2016 10:31 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

ద్రాక్షారామలో ఉద్రిక్తత - Sakshi

ద్రాక్షారామలో ఉద్రిక్తత

  • ప్రజా, దళిత సంఘాల బహిరంగ సభను భగ్నం చేసిన పోలీసులు
  • అడుగడుగునా మోహరింపు
  • 60 మందికి పైగా అరెస్టు
  • రామచంద్రపురం / రామచంద్రపురం రూరల్‌ :
    పోలీసు జీపుల సైరన్లు, పికెట్లు, మోహరింపులతో రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 20 ఏళ్ల కిత్రం వెంకటాయపాలెంలో జరిగిన శిరోముండనం కేసులో పీపీగా ఉన్న జవహర్‌ ఆలీని తొలగిస్తూ గత నెల 23న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును నీరు గార్చేందుకే ప్రభుత్వం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు అనుకూలంగా ఈ జీవో ఇచ్చిందని, దీనిని వెంటనే నిలుపు చేయాలని, బాధితుల తరఫున వెంటనే పీపీని నియమించాలని డిమాండ్‌ చేస్తూ ద్రాక్షారామ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు వివిధ ప్రజా, దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు.
    కాగా, గత నెల 26న రామచంద్రపురంలో అంబేడ్కర్‌ విగ్రహం కళ్లకు గంతలు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనుకూల వర్గం ఇదే రోజున ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నియోజకవర్గంలో సెక్షన్‌ 30 విధించారు. బహిరంగ సభలు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ద్రాక్షారామలో ప్రజా, దళిత సంఘాలు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మందపల్లి చిట్టిబాబు, దొమ్మలపాటి శ్యాంసుదర్, జిల్లా కార్యదర్శి బొమ్ము మోహనరావు, జైభీమ్‌ దళిత సంఘాల నేతలు సీహెచ్‌ కర్ణ, గుబ్బల శ్రీనివాస్, అంబటి తుకారం, రైతుకూలీ సంఘం నేతలు గుత్తుల వెంకట రమణలను ఉదయమే అదుపులోకి తీసుకుని, రాయవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ద్రాక్షారామ నలువైపులా ఉదయం నుంచీ పికెట్లు ఏర్పాటు చేశారు. సుమారు 60 మందికి పైబడి వ్యక్తులను అరెస్టు చేశారు. తెల్లవారుజామున ప్రారంభమైన అరెస్టులు సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ద్రాక్షారామలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
     
    అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా
    అడుగడుగునా పోలీసులు మోహరించినా సీపీఐ ఎంఎల్, రైతుకూలీ సంఘం, పీడీఎస్‌యూ, ఇతర దళిత సంఘాల ఆధ్వర్యాన ద్రాక్షారామ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. పీపీని తొలగిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, శిరోముండనం కేసును వెంటనే విచారణకు తీసుకురావాలని, బాధితులకు న్యాయం చేయాలని నినదించారు. వారిపై పోలీసులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని లాక్కొంటూ వెళ్లి వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కించారు. శిరోముండనం కేసులో ప్రధాన బాధితుడు కోటి చినరాజు, సీపీఐ ఎంఎల్‌ జిల్లా నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు గనిరాజు, పీవైఎల్‌ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, రైతుకూలీ సంఘాల నాయకులను అరెస్టు చేసి, వ్యాన్‌లో తరలించారు. ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. రైతుకూలీ సంఘం నాయకుడు కింద పడిపోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
     
    పోలీసులు పక్షపాతం
    ఇరువర్గాలవారూ ధర్నాకు, బహిరంగ సభకు పిలుపునిచ్చానా ఒకవర్గం వారినే పోలీసులు అరెస్టు చేసి అధికార పార్టీ నేతలకు కొమ్ము కాశారనే విమర్శలు తలెత్తాయి. టీడీపీకి చెందిన, ధర్నాకు పిలుపునిచ్చినవారినెవ్వరినీ అదుపులోకి తీసుకోకుండా.. జీవోను వ్యతికేరించిన వారిని మాత్రమే అరెస్టు చేయడం దారుణమని ప్రజా, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, టీడీపీ నేతలకు కొమ్ముకాసి, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement