ఉన్నత విద్యపై కరువు దెబ్బ
ఉన్నత విద్యపై కరువు దెబ్బ
Published Mon, Aug 15 2016 1:52 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
మెస్ బిల్లులు కట్టలేక విద్యార్థులు విలవిల
ఎస్కేయూ: ‘ కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్య అందిస్తాం... ఇంటికో ఉద్యోగం కల్పిస్తాం.. జాబు వచ్చేంతవరకు నిరుద్యోగ భతి కల్పిస్తాం... ఉన్నత విద్య బలోపేతం చేసేందుకు వర్సిటీలను ప్రక్షాళన చేస్తాం...పేద ,మధ్యతరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరూ వర్సిటీ చదువులు కొనసాగాలి..’ ఇవి గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు. అధికారంలోకి వచ్చాక ఇందుకు భిన్నంగా ప్రైవేటు వర్సిటీలకు ఎర్రతివాచీ పరిచి ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. మధ్యతరగతి, పేద విద్యార్థులు మెస్ బిల్లులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లాలోని శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సగటు విద్యార్థి దీనస్థితి ఇది...మెస్ బిల్లులు చెల్లించందే తరగతులకు అనుమతించేది లేదని వర్సిటీ అధికారులు తెలపడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ప్రజాప్రతినిధులకు పట్టదా ..!
కరువు నేపథ్యంలో ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న వర్సిటీ విద్యార్థులకు దన్నుగా నిలిచే విధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నుంచి సరైన భరోసా దక్కలేదు. వర్సిటీ పూర్వ విద్యార్థి అయిన పల్లె రఘనాథ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి పి.సునీత సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మెస్‌బిల్లులను రీయింబర్స్ చేస్తే కరువు జిల్లాలోని విద్యార్థులకు కొంతైనా ఊరట కలుగుతుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పెండింగ్‌లో ఉన్న మెస్‌బిల్లులను ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. ఇక్కడ కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బిల్లు చెల్లించలే కున్నాం....
మెస్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆలస్యంగానైనా చెల్లించి పీజీ తరగతులకు హాజరుకావాలని ఉంది. అయితే హాజరు తక్కువగా వస్తే పరీక్షలకు అనుమతికి ఆటంకం కలుగుతుంది.
–తిరుమలేశ్వర్ ,ఎంఎస్‌డబ్ల్యూ రెండో సంవత్సరం .
ప్రభుత్వం చేయూతనివ్వాలి
ఇక్కడి పరిస్థితులు అన్ని వర్సిటీలకు భిన్నం. మెస్ బిల్లులు చెల్లించేందుకు నాలుగు నెలలుగా బయట ఉద్యోగాలు చేసి డబ్బు చెల్లిస్తున్నాము. ప్రతిభకు కొదవలేని విద్యార్థులు ఎందరో ఎస్కేయూలో చదువుతున్నారు. వారందిరికీ ఆర్థిక చేయూతనివ్వాలి.
– నారాయణ రెడ్డి, ఎంఏ .
Advertisement
Advertisement