మత్తు.. యువత చిత్తు
మత్తు.. యువత చిత్తు
Published Wed, Jul 19 2017 12:23 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
జిల్లాలోనూ డ్రగ్స్ కోరలు
విస్తరిస్తున్న మత్తు మాఫియా
జోరుగా నార్కొటిక్ డ్రగ్స్ విక్రయాలు
భీమవరం ఘటనతో వెలుగులోకి
తణుకు : మద్యం.. గంజాయి.. గుట్కా.. తాజాగా డ్రగ్స్.. పేర్లు ఏమైనా ఇవి యువతను పెడదోవ పెట్టిస్తున్నాయి. వారిని బానిసలుగా చేసి భవిష్యత్‌ను చిత్తు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో జిల్లాలో గంజాయి వినియోగం బాగా పెరిగింది. దీనికి తోడు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న గంజాయి కొన్నిసార్లు పోలీసులకు చిక్కుతున్నా సింహభాగం మత్తు మాఫియా చేతుల్లోకి వెళుతోంది. ఈ పరిస్థితుల్లో చాపకింద నీరులా కొందరు అక్రమార్కులు రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో జిల్లాలోనూ వీటి కదలికలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో నార్కొటిక్ మందుల వినియోగం పెరిగింది. మెడికల్ షాపుల ద్వారా వీటిని కొందరు యువతకు చేరవేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా జిల్లాలో హోల్‌సేల్ మందుల దుకాణాలపై జరుగుతున్న దాడులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా భీమవరానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
పొరుగు జిల్లాల నుంచి దిగుమతి
పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లాకు దిగుమతి అవుతోంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు వాహనాలతో పాటు వివిధ వాహనాల్లో పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతోంది. బడా వ్యాపారులు చిన్న చిన్నవారికి తాయిలాలు ఎరగా చూపిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసి ఇళ్లల్లోనే చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆయా రైల్వేస్టేషన్లను వేదికగా చేసుకుని చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పలుమార్లు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేసినా తిరిగి అదే వ్యాపారం చేస్తుండటం విశేషం. వీటితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఫోర్టువిన్ ఇంజక్షన్లు తక్కువ ధరకు తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఫెన్సిడిల్, కోరెక్స్ వంటి కాఫ్ సిరప్‌ల వినియోగం పెరిగింది. సాధారణంగా కొన్నిరకాల నార్కొటిక్ డ్రగ్స్ వినియోగాన్ని నిషేధించారు. కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వీటిని విక్రయించాల్సి ఉండగా ముందుల దుకాణ యజమానులు యథేచ్ఛగా వీటిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా మందుల షాపుల్లో దొరికే ఎరేజ్ ఎక్స్ లిక్విడ్‌ను యువత ఎక్కువగా వినియోగిస్తున్నట్టు సమాచారం. ఈ మందును చేతిరుమాలుపై వేసుకుని వాసన పీల్చి మత్తులో జోగుతున్నారు.
ఇష్టారాజ్యంగా నిర్వహణ
జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. ఏమాత్రం అవగాహన లేకుండా మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మాసిస్ట్ అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి వరకు చదివిన వారైనా ఉండకపోవడం గమనార్హం. సాధారణంగా డాక్టర్ ధ్రువీకరించిన చీటీ ఉంటేనే మందులు ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల వరకు మెడికల్ షాపులు ఉండగా మరో 700 వరకు హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో తణుకు, ఏలూరు ప్రధాన కేంద్రాలుగా హోల్‌సేల్ వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 80 శాతం దుకాణాలు ఫార్మాసిస్టులు లేకుండానే నడుస్తుండగా కొత్తగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టడానికి పోటీ ఉంటోంది. పట్టణాల్లోనే ఫార్మాసిస్ట్ లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిషేధిత కఫ్ సిరప్‌ను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తున్న భీమవరానికి చెందిన ఒక వ్యాపారిపై గతేడాది కేసు నమోదు చేశారు. సుమారు 5 వేల బాటిళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా ముంబైలో పట్టుబడిన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ మాఫియా వ్యవహారానికి సంబంధించి జిల్లాలో అధికారులు తనిఖీలు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Advertisement