cow, mafia, eluru
cow, mafia, eluru
Published Sun, Jul 23 2017 12:31 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
విచారణ తప్పుదోవ
గోసంరక్షణ శాల నిర్వాహకుడిపైనే దృష్టి
మాఫియా నుంచి ఫిర్యాదుల స్వీకరణ
కేసులో నుంచి బయటపడేందుకు
పోలీసుల తిప్పలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమంగా రవాణా అవుతున్న గోవులు మృత్యువాత పడిన కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులు తిప్పలు పడుతున్నారు. ఈ వ్యవహారంలో తమ బాధ్యత లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గోసంరక్షణ శాల నిర్వాహకుడు శ్రీనివాస్ లక్ష్యంగా విచారణ చేపడుతున్నారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పిలిపించి వారి నుంచి శ్రీనివాస్‌కు ఫిర్యాదులు స్వీకరించడం అనుమానాలకు తావిస్తోంది.
అక్రమ రవాణాదారుల అరెస్ట్‌లేవీ?
అసలు గోవుల అక్రమ రవాణాకు కారణమైన వారిని ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. ఆ దిశగా యత్నాలూ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వదిలేసి గో సంరక్షణ శాల నిర్వాహకుడిపై పోలీసులు పడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకూ 23 అక్రమ రవాణా కేసులు నమోదు చేసిన పోలీసులు పట్టుబడిన సుమారు 1800 అవులను ఆవపాడులోని గోసంరక్షణ సమితికి అప్పగించినట్టు సమాచారం. అయితే ఇప్పుడు అక్కడ 210 గోవులు మాత్రమే ఉండటంతో మిగిలినవి ఏమయ్యాయి? ఎవరికి ఇచ్చారు? అక్రమ రవాణా చేశారా? అన్న విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసులో గోశాల నిర్వాహకుడిని లక్ష్యంగా చేశారు.
చాలాకాలంగా అక్రమ రవాణా
జిల్లా మీదుగా పశువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. ఇటీవల పశువుల అక్రమ రవాణాను జిల్లా సరిహద్దులు దాటించే వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పశువుల రవాణా అవుతున్న వాహనాల వివరాలను వారిలో వారే పోలీసులకు చేరవేస్తున్నారు. దీనిని తెలుసుకున్న పశువుల అక్రమ రవాణా పెద్దలు వీరందరినీ తిరిగి సిండికేట్ చేసే యత్నం చేశారు. గతంలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా పశువులను జిల్లా సరిహద్దులు దాటించేవారు. అయితే పోలీసులకు సమాచారం అందుతుండటంతో ఇటీవల రూట్ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా జిల్లా దాటిస్తున్నట్టు సమాచారం. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలు సీజ్ చేస్తే దగ్గరలోని గోశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికిరాత్రే మళ్లీ తెలంగాణకు తరలిస్తున్నట్టు సమాచారం. దీనికి దళారులు వాహనాలు, సరిహద్దు దాటించే వ్యక్తులు అవసరమైతే పశువుల రవాణా చేసే వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. శనివారం దేవరపల్లి పోలీసుస్టేషన్‌లో దళారులు గోమాఫియాకు చెందిన వారిని పిలిపించి పంచాయితీ చేస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో గోసంరక్షణ సమితి నిర్వాహకుడిదే తప్పు అనేలా వారితో పోలీసులు ఫిర్యాదులు ఇప్పిస్తున్నట్టు తెలిసింది. అసలు మాఫియాను పట్టుకోకుండా కొసరు వ్యక్తులను బాధ్యులుగా చూపించి వ్యవహారాన్ని సెటిల్ చేసే యత్నాలు జరుగుతున్నాయి.
పోలీసుల అదుపులో శ్రీనివాస్
మరోవైపు వెంకట్రామన్నగూడెం రిజర్వు ఫారెస్ట్‌లో ఆవపాడు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న గోశాల కన్వీనర్ కొండ్రెడ్డి శ్రీనివాస్‌ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గోశాలలో గోవులకు ఆలనాపాలనా కరువైంది. కన్వీనర్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడంతో మిగతా పరివారం కూడా పరారయ్యారు. ఆవులను దత్తత తీసుకోవడానికి వస్తున్న రైతులే ఇక్కడ సేవకులయ్యారు. గురువారం ముందు నాటికి ఉన్న 180 ఆవులతోపాటు, తదనంతరం దేవరపల్లి పోలీసులు అప్పగించిన 30 ఆవులకు గడ్డి, నీరు రైతులే అందిస్తున్నారు. ప్రస్తుతం గోశాల వద్ద దేవరపల్లి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ పహారా కాస్తున్నాడు.
Advertisement
Advertisement