-
-
పలు రాష్ట్రాల నుంచి హాజరైన విలువిద్య క్రీడాకారులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) :
ఏకలవ్య-2వ జాతీయ స్థాయి ట్రైబల్ ఆర్చరీ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలోని ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్‌లో శనివారం అట్టహాసంగా మొదలైంది. దీనిని ఆన్‌సోర్ డైరెక్టర్ వీపీ మహావార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విలువిద్యను అభివృద్ధి చేసి గిరిజనుల ప్రతిభను వెలికి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. దీనిని నిర్వహిస్తున్న చెరుకూరి సత్యనారాయణ వోల్గా ఆర్చరీ అకాడమీ మరింత మంది విలువిద్య క్రీడాకారులను తయారు చేసి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాక్షించారు.
202 క్రీడాకారిణిలు హాజరు
దీనికి వివిధ రాష్ట్రాల నుంచి 202 విలువిద్య క్రీడాకారిణిలు హాజరయ్యారు. రికర్వో విభాగంలో 60 మీటర్లు, 70 మీటర్లు, ఇండియన్ రౌండ్ విభాగంలో 30 మీటర్లు, 50 మీటర్లలో సీనియర్, సబ్ జూనియర్, బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆదివారం జరుగు ఒలింపిక్ రౌండ్(నాక్ అవుట్)లో విజేతలను ప్రకటిస్తారు.
ఒలింపిక్ చాంపియన్‌షిప్ లక్ష్యం
1988 నుంచి శిక్షణ పొందుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నాను. 1994లో పూనే నేషనల్ గేమ్స్‌లో ఆరు బంగారు పతకాలు సాధించాను. మూడు ఒలింపిక్స్‌కు కోచ్‌గా పని చేశాను. ఒలింపిక్‌లో చాంపియన్‌షిఫ్ లక్ష్యమే ధ్యేయంగా విద్యార్థులను తయారుచేస్తున్నాను.
- పూర్ణిమ మహాతో, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జార్ఘండ్
ఏషియన్ గేమ్స్ లక్ష్యం
2007లో జంబల్‌పూర్‌లో సబ్ జూనియర్స్ తొలి జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఏషియన్ గ్రాండ్ ఫిక్స్‌లో ఒకటి, సౌత్‌ఈస్ట్ ఏషియన్ చాంపియన్ షిఫ్ సాధించాను. ఏడు గోల్డ్ మెడల్స్‌తో కలిపి మొత్తం 30 పైగా మెడల్స్ సాధించాను. ఏషియన్ గేమ్స్‌లో ప్రథమస్థానం సాధించడమే నా లక్ష్యం.
- వై.అనూషరెడ్డి, నేషనల్ ప్లేయర్, విజయవాడ
మంచి ప్రోత్సాహం అందుతోంది
విలువిద్య అంటే చాలా మక్కువ. ఆ ఆసక్తితోనే విజయవాడలోని చెరుకూరి సత్యనారాయణ ఆర్చరీ అకాడమీలో చేరా. ఇప్పటి వరకు 25 నేషనల్స్ పోటీలకు వెళ్లాను. ఏడు మెడల్స్ సాధించాను. నాకు అకాడమీ మంచి ప్రోత్సాహం ఇస్తోంది.
- టి.రవిచంద్ర, నేషనల్ ప్లేయర్, విజయవాడ
మంచి జీవన విధానం ఏర్పడుతుంది
విలువిద్య ద్వారా మంచి జీవన విధానం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్‌లో తొమ్మిది, నేషనల్స్‌లో తొమ్మిదింటిలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు 30 పతకాలు సాధించాను. 2005 శిక్షణ పొంది 2007 నుంచి పలు పోటీలకు హాజరయ్యాను.
- సంజయ్‌బోరో, నేషనల్ ప్లేయర్, అస్సాం
ఒలింపిక్ మెడలే లక్ష్యం
నా కుమార్డు లెనిన్ విలువిద్యలో ఎన్నో మోడల్స్ సాధించాడు. దీనికి 2010లో హైదరాబాద్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి చేతులమీదుగా సన్మానం అందుకుని వస్తుంటే విజయవాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కుమారుడు చనిపోయాడు. అదే సమయంలో నేను అంధుడినయ్యా. అయితే నా కుమారుడి కోరిక మేరకు ఒలింపిక్ పతకం తీసుకురావాలే లక్ష్యంతో ఉన్నా. వయస్సు పెద్దది. నాకు ఎవరూ లేరు. దీంతో సరోగమి గర్బం ద్వారా ఒక కూతురిని కన్నాం. పాప పేరు శివాని. ఐదేళ్ల వయస్సు. ఇప్పటికి మూడు మెడల్స్ సాధించింది. అమెరికాకు చెందిన డిస్నీ సంస్థ వారు శివానీ విలువిద్యపై డాక్యుమెంటరీ తీశారు. నా అకాడమీ, శివానీ ద్వారా దేశానికి ఒలింపిక్ పతకం తేవడమే నా ప్రధాన లక్ష్యం.
- చెరుకూరి సత్యనారాయణ, అకాడమీ అధ్యక్షులు, విజయవాడ