కడప కోటిరెడ్డి సర్కిల్:
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులలో చేనేత ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు జూలై 31న నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థుల వివరాలను సహకారశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించి ‘భారత చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు’ అనే అంశంపై నిర్వహించిన పోటీలో గుండ్లూరు జెడ్పీ హైస్కూలుకు చెందిన బి.ఆనంద్ ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే కడప ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన కె.శ్రీలిఖితేశ్వరి ద్వితీయ స్థానంలో, కడప సీఎస్‌ఐ హైస్కూలుకు చెందిన సాగర్ తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.
అలాగే 6, 7 తరగతులకు సంబంధించి కడప రాయలసీమ హైస్కూలు విద్యార్థి ఆదికేశవులు ప్రథమ స్థానంలో, శ్రీ వెంకటేశ్వర హైస్కూలుకు చెందిన డి.ఉదయ్‌కుమార్ ద్వితీయ, రాయలసీమ హైస్కూలుకు చెందిన వి.విజయ్ తృతీయ స్థానంలో నిలిచారన్నారు. వీరికి ఈ నెల 7న కడప కళాక్షేత్రంలో జాతీయ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని చేనేత సహకార శాఖ సంచాలకులు జయరామయ్య, సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ రామ్మూర్తిరెడ్డి, చంద్రముని తెలిపారు.