దొంగనోట్ల ముఠా గుట్టురట్టు | Fake notes betrayed the robber gang | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

Published Thu, Sep 1 2016 10:56 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - Sakshi

దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

–రూ.18.91 లక్షలు, ప్రింటర్‌ స్వాధీనం  
–నిందితులందరూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారే
–వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంగోపాల్‌రావు
మిర్యాలగూడ అర్బన్‌
దొంగనోట్లను ప్రింట్‌ చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు వ్యక్తులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 18.91 లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాంగోపాల్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా వెల్ధుర్తి మండలం, కండ్లకుంట గ్రామానికి చెందిన సుదెనబోయిన అమరయ్య రెండు నెలల క్రితం విజయవాడలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద కలర్‌ ప్రింటర్, కటింగ్‌మిషన్‌ కొనుగోలు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు దొడ్డామార్కొండారెడ్డి, తాటిపర్తి పాపిరెడ్డిలతో పాటు వెల్ధుర్తి మండలం గంగలకుంటకు చెందిన బత్తుల శ్రీరాములు ముఠాగా ఏర్పడ్డారు.  గ్రామంలో దొంగనోట్లు ముద్రిస్తే అందరికీ తెలస్తుందని, ప్రస్తుతం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామంలో నివాసముంటున్న గుంటూరు జిల్లా కండ్లకుంట గ్రామానికి చెందిన చెన్నుపల్లి యశోద వద్దకు చేరుకున్నారు. కొంతకాలంగా ఆమె ఇంట్లోనే దొంగనోట్లు ముద్రించి చుట్టుపక్కల గ్రామాల్లో చలామణి చేస్తున్నారు.
సిగరేట్‌ ప్యాకెట్‌ కొనుగోలు చేస్తూ..
ఈ ముఠా సభ్యులు చాకచక్యంగా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి  దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడం గ్రామంలో కిరాణం షాపు వద్దకు టీవీఎస్‌ అపాచీ బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చి పెద్దగోల్డ్‌ఫాక్‌ సిగరేట్‌ డబ్బా కొనుగోలు చేసి రూ.500ల నోట్‌ ఇచ్చారు. కాగా ఆ నోట్‌ను తీసుకున్న కిరాణషాపు నిర్వాహకురాలు బెల్లంకొండ కాశమ్మ నోట్‌ను తన కూమారుడు సైదులుకు చూపించింది. ఆ నోట్‌ను నకిలీదని గుర్తించగానే ఆ ముఠా సభ్యులు బైక్‌పై పరారయ్యారు. దీంతో కిరాణషాపు నిర్వహకుడు  గ్రామస్తుల సహకారంతో వారిని వెంబడించారు. దామరచర్ల సమీపంలో వారిని పట్టుకుని దామరచర్ల పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో దొంగనోట్లు ముద్రించి చలామణి చేస్తూ పట్టుపడిన వారిని, వారికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు. జల్సాలకు అలవాటు పడిన వీరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. వారి నుంచి హెచ్‌పీ కలర్‌ ప్రింటర్‌తో పాటు పేపర్‌కటింగ్‌ మిషన్, అపాచిబైక్, రూ.18.91లక్షలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో రూరల్‌ సీఐ రవీందర్‌రెడ్డి, వాడపల్లి ఎస్‌ఐ చరమందరాజు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement