దొంగ నోట్ల ముఠా అరెస్టు
ఆరుగురు రిమాండ్, పరారీలో ఒకరు
రూ.లక్షా ఐదు వేల నకిలీ కరెన్సీ స్వాధీనం
ల్యాప్‌టాప్, ప్రింటర్స్, పేపర్స్, కలర్స్ సీజ్
సూర్యాపేట మున్సిపాలిటీ : దొంగ నోట్లను చెలమాణి చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట పోలీసులు అపులోకి తీసుకున్నారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సునీతామోహన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కష్టం లేకుండా సులభంగా సంపాదించాలనే దురాలోచనతో ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన కప్పల విజయ్, మానుపురి వరప్రసాద్, హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన రాపోలు శ్రీనివాస్ అతడి తమ్ముడు సురేందర్, వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరుకు చెందిన తెడ్డు ప్రభాకర్, నర్సింహులగూడెంకు చెందిన గొడుగు రామకృష్ణ, అక్బర్ నకిలీ నోట్లను తయారీ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన ఈ దందాకు రాపోలు శ్రీనివాస్ ప్రధాన సూత్రదారిగా వ్యవహరించాడు. అయితే ఈ నోట్ల చెలామణిని నల్లగొండ, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు యత్నించే క్రమంలో సూర్యాపేట పోలీసులు ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేయగా, నర్సింహులగూడెంకు చెందిన అక్బర్ పరరీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.
నిందితులు చిక్కారిలా...
ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన కప్పల విజయ్ కొత్త బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తుండంతో పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా అతడి వద్ద ఎనిమిది నకిలీ రూ.500 నోట్లు లభించాయి. అతడిని విచారించగా గ్రామానికి చెందిన మానుపురి వరప్రసాద్, రామంతాపూర్‌కు చెందిన రాపోలు శ్రీనివాస్ పేర్లు బయటపడ్డాయి. సుమారు 350 నకిలీ రూ.500 నోట్లను తెచ్చిన వరప్రసాద్ 70 నోట్లను మార్చాడు. అనంతరం 270 నోట్లను కాల్చివేసి, 10 నోట్లు విజయ్‌కు ఇచ్చినట్టు విచారణలో తేలింది. విజయ్, వరప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్న అనంతరం రామాంతపూర్‌లోని శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఉన్న శ్రీనివాస్‌తో పాటు అతడి తమ్ముడు సురేందర్, నకిలీ నోట్లు తీసుకెళ్లేందుకు వచ్చిన వరంగల్‌కు చెందిన తెడ్డు ప్రభాకర్, గొడుగు రామకృష్ణ పట్టుబడ్డారు. ఈ దాడిలో రూ.లక్షా ఐదు వేల నకిలీ కరెన్సీ, లాప్టాప్, ప్రింటర్స్, పేపర్స్, కలర్స్, కట్టర్, కలర్ జీరాక్స్, రెండు నర్సింగ్ సర్టిఫికెట్లు, మగధ యూనివర్సిటీకి చెందిన నకిలీ లెటర్హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీ నోట్ల తయారీలో మరో నింధితుడు అక్బర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా, నకిలీ నోట్ల తయారీ కేసును చాకచక్యంగా ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బంది శనగాని వెంకన్నగౌడ్, చామకూరి శ్రీనివాస్‌గౌడ్, కరుణాకర్, కృష్ణ, రాజులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫారస్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మొగలయ్య, ఎస్ఐ క్రాంతికుమార్, శనగాని వెంకన్నగౌడ్, చామకూరి శ్రీనివాస్‌గౌడ్, ఇరుగు బాబు, భద్రారెడ్డి, రవినాయక్, వీరన్న పాల్గొన్నారు.