గార్లలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న జేడీఏ మణిమాల
- ఎరువుల దుకాణాల తనిఖీలో జేడీఏ మణిమాల
గార్ల : నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎరువులు, పురుగులమందు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏ) పి.మణిమాల దుకాణాల డీలర్లను హెచ్చరించారు. ఇటీవల గార్ల మండలంలో నకిలీ విత్తనాలను వ్యాపారులు విక్రయించారని, వాటిని విత్తుకుంటే నారు మొలవలేదని పలువురు రైతులు సదరు విత్తన ప్యాకెట్లను జేసీ దివ్యకు చూయించి, న్యాయం చేయాలని వేడుకున్నారు. జేసీ ఆదేశాలతో జేడీఏ సోమవారం గార్లలోని ఎరువుల, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేసి.. స్టాక్ రికార్డులను పరిశీలించి, గోదాంలను సందర్శించారు. ఎరువుల ధరల పట్టిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం తగ్గించిన ధరలకే ఎరువులను అమ్మాలని, ఎవరైనా అధిక రేట్లకు అమ్మితే ఫోన్‌ద్వారా రైతులు ఫిర్యాదు చేయొచ్చని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. ఆమె వెంట ఏఓ పి.నాగయ్య ఉన్నారు.