‘తోటపల్లి’ ఆధునికరించాలి
► ‘తోటపల్లి’ ఆధునికీకరణ విస్మరించిన ప్రభుత్వం
► తోటపల్లి కాలువల పోరాట సమితి
వీరఘట్టం: రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ.. రైతులను ఏటా మోసగిస్తోందని తోటపల్లి కాలువల ఆధునికీకరణ పోరాట సమితి అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు ఆరోపించారు. వీరఘట్టంలో అన్నదాతలతో కలిసి బుధవారం రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్ జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. నీరు–చెట్టు పేరుతో నిధులు దోపిడీ చేస్తోందే తప్ప తోటపల్లి కాలువల ఆధునికీకరణ అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు.
వందేళ్లు దాటిన తోటపల్లి పాత ఆయకట్టు కుడి, ఎడమ కాలువల గట్లు ఆధ్వానంగా ఉన్నాయని.. తరుచూ గండ్లు పడుతుండడంతో సకాలంలో సాగునీరు అందక రైతులు ఏటా పంటలు కోల్పోతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ తోటపల్లి కాలువల ఆధునికీకరణ చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ రైతులను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో సాధన కమిటీ సభ్యులు రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. కాలువల ఆధునికీకరణ జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రాస్తారోకో, సమావేశంలో మండల నలుమూలల రైతులు పాల్గొన్నారు.