పేద ఎస్సీ రైతులకు చేయూత
మచిలీపట్నం (చిలకలపూడి) :
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ నిరుపేద రైతులకు వ్యవసాయ సామగ్రిని ఉచితంగా అందజేయనున్నట్లు ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా రెండు ఎకరాలోపు ఉన్న నిరుపేద ఎస్సీ రైతులు బోరుబావులు, ఎలక్ట్రానిక్ మోటారు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఉచితంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కొత్తగా వ్యవసాయం చేస్తూ బోరు, కరెంటు లైను, ఎలక్ట్రానిక్ మోటార్‌ల ఏర్పాటుకు రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకోసం మీ–సేవా ద్వారా పొందిన కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు నకలు, భూమి పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో దరఖాస్తుతో పాటు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
యువస్పూర్తి సమ్మేళనాలు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అక్టోబరు 1వ తేదీ నుంచి నియోజకవర్గస్థాయిలో యువస్ఫూర్తి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఈడీ తెలిపారు. ఇందులో సంక్షేమ పథకాలపై అవగాహన, అలాగే రుణాల మంజూరుపై లబ్ధిదారులు, బ్యాంకుల మధ్య చర్చలు నిర్వహిస్తామన్నారు.