‘వ’ట్టిసీమే!
పట్టిసీమపై ప్రభుత్వం ఆర్భాట ప్రచారం
ఆచరణలో నీరందని వైనం
కంటితుడుపు చర్యలతో అన్నదాతల్లో అయోమయం
పశ్చిమ డెల్టా రైతుల్లో ఆందోళన
‘పట్టిసీమ నుంచి నీటిని విడుదల చే శాం.. నారుమళ్లు పోసుకుని వరినాట్లు వేసుకోవచ్చు.. తుపాన్లు రాకముందే పంట చేతికొస్తుంది.. డెల్టా రైతులకు ఎలాంటి సమస్యలూ లేకుండా నివారించాం..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన కు, వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి వస్తున్నాయని చెబుతున్న గోదావరి జలాలు పశ్చిమ డెల్టాకు అరకొరగానే ఉన్నాయి. నారుమళ్ల సంగతలా ఉంచితే వెదlపద్ధతిలో వరిసాగుకు శ్రీకారం చుట్టిన అన్నదాతలు సాగునీటిపై బెంగటిల్లుతున్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాలకు త్వరితగతిన నీరు చేరుకోవాలని కోరుకుంటున్నారు
సాక్షి, అమరావతి / తెనాలి: డెల్టాలో ఏటా జూన్‌లో ఆరంభమయ్యే ఖరీఫ్ సీజను, ప్రతికూల పరిస్థితుల కారణంగా జూలై, ఆగస్టు నెలలకు మారి, చాలా కాలమైంది. గతేడాదిలానే ఈసారీ వర్షాలు జూన్‌లో వచ్చేసి ఆశ్చర్యపరిచాయి. నీటిని ఒడిసిపట్టేందుకు పులిచింతల సిద్ధం కాలేదు. పట్టిసీమ నుంచి ఈ నెల ఆరున నీరు విడుదల చేసినా పది రోజులకు కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ఆ తర్వాతా అరకొరే. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని 5.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు గత రెండు రోజులు కేవలం 500 క్యూసెక్కులనే ఇస్తున్నారు. 2.50 లక్షల ఎకరాలున్న కొమ్మమూరు కాలువకు కేవలం 55 క్యూసెక్కులట. రేపల్లె బ్యాంక్ కాలువకు 146 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 206, నిజాంపట్నం కాలువకు 110 ఇస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పరిమాణాన్ని 1016 క్యూసెక్కులకు పెంచారు. అయినా కాలువ ఎగువ భూముల్లోనే నారుమళ్లకు నీరు ఎక్కటం లేదని రైతులు చెబుతున్నారు.
గతేడాదీ ఇదే స్థితి...
గతేడాది ఖరీఫ్ సీజనులో కృష్ణాడెల్టాకు కేవలం 35.17 టీఎంసీలే ఇచ్చారు. పట్టిసీమతో డెల్టా అవసరాలు తీరతాయని ఊదరగొట్టిన పాలకులు మాట నిలుపుకోలేకపోయారు. వరిపైరు కీలక దశలో నీటి తడులు ఇవ్వలేకపోయారు. దీంతో రెండు లక్షల ఎకరాల్లో సాగు వదిలేయాల్సి వచ్చింది. 20 వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఆయిల్ ఇంజిన్లతో నీరు పెట్టినా, సగటున 21–22 బస్తాల ధాన్యానికి మించి రాలేదనే విషయం తెలిసిందే. జిల్లాలో ధాన్యం దిగుబడి ఐదు లక్షల టన్నులు తగ్గింది. గత ఏడాది చేదు అనుభవంతో ప్రస్తుత ఖరీఫ్‌కు జాగ్రత్తపడాల్సిన పాలకులు, నారుమళ్లకు కూడా సరిపడా నీరివ్వలేకపోతున్నారు. పోలవరం కుడికాలువ పనులు పూర్తిస్థాయిలో జరగనందునే గోదావరిలో నీరున్నా, తీసుకోవటం సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
గతేడాది వర్షాల కరువుతో వరి నారుమళ్లు వదిలేసి, రైతులు వెద పద్ధతిలో వరిసాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాల్లో వెదజల్లారు. ప్రస్తుతం ఆ పరిస్థితులే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాలు లేకపోవటం, కాలువలకు సరిపడా నీరు రాకపోవటంతో ఆయిలింజిన్లతో నీరు పెడుతున్నారు. ఎకరం తడిపేందుకు కనీసం రూ.2 వేల వరకు ఖర్చవుతోంది. ఇలా తడులిచ్చినా వర్షాలు కురిసి, పంట కాలువల్లో సాగునీరు అందితేనే దిగుబడులు బాగుండే అవకాశముంటుంది.
జిల్లాలో సాగునీటి విడుదల ఇలా..
గుంటూరు పశ్చిమ డెల్టాకు సంబంధించి నాలుగు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బ్యాంకు కెనాల్ సామర్థ్యం 2700 క్యూసెక్కులు కాగా 150, ఈస్ట్ కెనాల్ 770 క్యూసెక్కులకుగాను 182, నిజాంపట్నం కాలువ 440 క్యూసెక్కులకు గాను 110, కొమ్మమూరు 3600 క్యూసెక్కులకు గాను 203 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాలువలకు తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడంతో కొన్ని చోట్ల స్లూయిస్‌కు నీరు అందడంలేదు. దీంతో పంట పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. వరినారు పోసుకొనేందుకు ఇబ్బందిగా మారింది.