బెంగళూరు వెళ్లేందుకు గుంతకల్ రైల్వేస్టేషన్‌కు ఆటోలో వెళ్తున్న హులేబీడు గ్రామ కూలీలు
- తట్టా బుట్టా సర్ధుకుంటున్న
వ్యవసాయ కూలీలు
- బతుకు వేటలో భాగంగా
పట్నం దిశగా అడుగులు
- ఆలూరు మండలంలో
పెరుగుతున్న వలసలు
ఆలూరు రూరల్ : వర్షాభావం కారణంగా స్థానికంగా పనులు లేకపోవడం, అరకొరగా పండిన పంట దిగబడులు ఇళ్లు చేరడం, ఉపాధి పనులు ప్రారంభించకపోవడం, సంక్రాంతి సైతం వెళ్లిపోవడం వెరసి ఆలూరు డివిజన్‌లోని పల్లెలు వలస బాట పట్టాయి. బతుకు వేటలో భాగంగా చిన్న, సన్నకారు, వ్యవసాయ కూలీలు గుంటూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సోమవారం మండల పరిధిలోని హుళేబీడు, తుంబళబీడు, ఆలూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీలు తట్టాబుట్టా సర్ధుకుని పిల్లాపాపలతో గుంటూరు పోయేందుకు దాదాపు ఆరు ఆటోల్లో గుంతకల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వారిని పలకరించగా స్థానికంగా ఉపాధి పనులు అరకొరగా కొనసాగుతుండడం, పనికితగ్గ వేతనం లేకపోవడం, పనులు చేసినా కూలీ డబ్బులు చేతికి రాకపోవడంతోనే వలస వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా పనులు అరకొరగానే ఉన్నాయని ఇప్పటికే అక్కడకు వెళ్లిన వారు చెప్పారని, అయితే ఇక్కడే ఉంటే పూట గడవని పరిస్థితులు వస్తాయని భావించి ఉన్నకాడికే చాలనే ఉద్దేశ్యంతో వెళ్తున్నామని నిట్టూర్చారు.