హాలాహలం! ప్రాణాలను తోడేస్తున్న జలం
♦ నీటి శుద్ధిపేరుతో యథేచ్ఛగా దందా
♦ పుట్టగొడుగుల్లా వెలిసిన ప్లాంట్లు
♦ అనుమతులు లేకుండానే కొనసాగింపు
♦ చోద్యం చూస్తున్న అధికారులు
నీటిశుద్ధి ప్లాంట్లు జిల్లాలో ఎడాపెడా వెలుస్తున్నాయి. శుద్ధికి తిలోదకాలిచ్చి డబ్బు సంపాదనే ధ్యేయంగా నిర్వాహకులు యథేచ్ఛగా నీటి దందా నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు ‘నీళ్లు’వదులుతున్నారు. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండానే తమ ప్లాంటుకు బ్యూరోఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్‌ఐ) గుర్తింపు ఉందని లేబుళ్లు ముద్రించి క్యాన్లకు అతికించి వ్యాపారం చేస్తుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచిత్రం.
సిద్దిపేట: తీవ్ర వర్షాభావం.. ప్రజల అవసరాలను గుర్తించిన కొందరు నీటిశుద్ధి ప్లాంటు నెలకొల్పుతున్నారు. సుమారు పది ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. అవేవి పట్టించుకోకుండానే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ బోరు బావి ఉంటే అక్కడ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. జిల్లాలో ఉన్న వాటర్ ప్లాంట్లలో కనీసం పదిశాతం ప్లాంట్లకు కూడా బీఎస్‌ఐ గుర్తింపులేకపోవడం పరిస్థితి తీవ్రతను, అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుపుతోంది.
ప్రజల అవసరమే వ్యాపారం...
తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు చేసైనా మంచినీరు సేవించాలని ప్రజలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వాటర్‌ప్లాంట్ల యజమానులు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. జిల్లాలో సుమారు 350 ప్లాంట్లు ఉండగా 20 ప్లాంట్లకు మాత్రం బీఎస్‌ఐ గుర్తింపు ఉన్నట్లు సమాచారం. బీఎస్‌ఐ గుర్తింపు పొంది నీటిని శుద్ధిచేయాలంటే ప్రతిరోజూ 20 పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాని అందంత తమకెందుకని భావిస్తున్న వ్యాపారులు బోరుబావి నీటిని నామమాత్రంగా శుద్ధి చేస్తూ, తమ ప్లాంటుకు బీఎస్‌ఐ గుర్తింపు ఉందని లేబుళ్లు ముద్రించి క్యాన్లకు అతికించి వ్యాపారం చేస్తున్నారు. అవే నీటిని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా నామమాత్రంగా శుద్ధి చేసిన నీటిని సేవిస్తే కాళ్లు, చేతులు లాగడం లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
బీఎస్‌ఐ గుర్తింపు ఉంటే ...
వాటర్ ప్లాంటు ఏర్పాటుకు బీఎస్‌ఐ గుర్తింపు పొందాలంటే వాల్టా చట్టం కింద భూగర్భ జల శాఖ అనుమతి తీసుకోవాలి. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇలా అన్ని అనుమతులు ఉంటేనే వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలి. కనీసం 2వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేయాలి. ప్లాంటు చుట్టూ మురుగు కాలువలు లేకుండా చూసుకోవాలి. ప్లాంటులో స్యాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, రివర్స్ ఆస్మాసిస్ విధానంలో వడగట్టిన నీటిని చివరికి అల్ట్రా వాయిలెట్ కిరణాల ద్వారా శుద్ధి చేసి బ్యాక్టిరియా తొలగిస్తారు.
ఇలా ప్రతిరోజూ నాలుగు గంటలకోసారి పరీక్షలు చేస్తారు. అందులోనే ప్రత్యేకంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి రోజూ 30 రకాల పరీక్షలు చేసి, నీటి శుద్ధిపై నివేదికలు తయారు చేసి బీఎస్‌ఐకి పంపాలి. అన్ని రకాల నాణ్యతలు ఉంటేనే తదుపరి ప్లాంటు నడపడానికి అనుమతిస్తారు. చాలా మంది వ్యాపారులు బీఎస్‌ఐ గుర్తింపులేకుండానే తమకు తోచిన విధంగా శుద్ధి చేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బీఎస్‌ఐ గుర్తింపులేని ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు.