ప్రజాసేవే ప్రథమ కర్తవ్యం
– అగ్నిమాపక భటుల ధైర్య సాహసాలు ప్రశంసనీయం
– జిల్లా అదనపు జడ్జి సుబ్రమణ్యకుమార్
అనంతపురం సెంట్రల్ : ప్రజా సేవే ప్రథమ కర్తవ్యంగా భావించి, ప్రజా సంక్షేమం కోసం పునరంకితం కావాలని జిల్లా అదనపు జడ్జి సుబ్రమణ్యకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. తొలుత అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు జడ్జి మాట్లాడుతూ...అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో అగ్నిమాపక భటులు చూపించే తెగువ, ధైర్య సాహసాలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక భటులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి జయన్న మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి ఏడాది వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. శనివారం నుంచి వారం రోజుల పాటు ప్రధాన కూడళ్లలో, రైల్వే స్టేషన్స్, హాస్పటల్స్, విద్యా సంస్థలు, పరిశ్రమలు తదితర వాటిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు :
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొవాలి అనే అంశంపై అగ్నిమాపక అధికారులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలను ఏ విధంగా రక్షిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే ఇంట్లో గ్యాస్ ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలు ఎలా అర్పాలి అనే అంశంపై డెమో నిర్వహించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం ఆవరణంలో పరికరాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి శ్రీధర్, కేంద్ర అధికారి లింగమయ్య, ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.