నిర్మల్‌రూరల్: నాలుగు శతాబ్ధాల చరిత్ర కలిగిన నిర్మల్ ప్రాంతం సాహసోపేతమైన వీరుల చరిత్రకు.. వారి అసమాన త్యాగాలకు సజీవ సాక్ష్యం. ఆంగ్లేయ, నిజాం రాజులను ముప్పతిప్పలు పెట్టి, గొలుసుకట్టు చెరువుల నీళ్లు తాగించిన ఘనత ఇక్కడి వీరులది. తమ వద్ద అధునాతన ఆయుధాలు లేకున్నా, శక్తియుక్తులతో శత్రువులను హడలెత్తించిన ధీరులు వారు. 1857లో జరిగిన ప్రథమసంగ్రామంలోనే నిర్మల్ ప్రాంతం పాల్గొంది. 1860లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీగోండు చెల్లాచెదురుగా ఉన్న ఈ ప్రాంతవాసులందరినీ ఏకం చేశాడు. పరాయి దేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై పోరాడాలని పిలుపునిచ్చాడు.
అడవుల్లోకీ చొచ్చుకు వస్తున్న ఆంగ్లేయులను దొంగదెబ్బ తీయాలని సమరశంఖం మోగించాడు. స్థానిక హైదరాబాద్ పాలకులకూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో.. చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. వీటిని కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయులపై నెలల తరబడి పోరు సాగించాడు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం, ఆంగ్లేయ బలగాలు దాడులకు పాల్పడ్డాయి. వాళ్లను రాంజీగోండు సైన్యం వీరోచితంగా ఎదుర్కొంది. తమవద్ద బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలూ ఉన్నా కొరకరాని కొయ్యగా రాంజీగోండు మారడంతో శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీగోండుతో సహా వెయ్యిమంది వీరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లికి వెళ్లే మార్గంలో గల మహా మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఉరితీశారు. మాతృభూమి కోసం పోరాడిన వీరులు చిరునవ్వులతోనే ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర కనీసం బయటకు రాలేదు. ఈ మధ్యే రాంజీగోండు పేరిట నిర్మల్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సమరయోధుల సంఘటిత పోరు
ప్రథమ స్వాతంత్ర పోరాటంలో రాంజీగోండు ప్రజలను ఏకం చేస్తే.. మలి పోరులో ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు సంఘటితంగా పరాయిపాలనపై పోరు జరిపారు. అప్పటి నిర్మల్ పంచాయతీ సమితి పరిధిలో గోపిడి గంగారెడ్డి, గణపతి, బాపూరావు, బోరేగాం గజన్న, లాలు పటేల్, ఎ.రాజన్న, పోశెట్టి, గంగాధర్, శివన్న, గంగారాం, విఠల్‌రావు, జమునాలాల్, వెంకోబరావు, చిన్న నర్సింహులు, లింగారెడ్డి, సుందర్‌రాజ్, ఎల్లయ్య, గంగాధర్‌గుప్తా.. ఇలా ఎంతోమంది సమరయోధులు ముందుండి పోరాడారు. అప్పట్లో నిజాం పాలనను ఎదుర్కొనేందుకు నిర్మల్ ప్రాంతంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో పోరాటాలను చేపట్టారు. ఇప్పటికీ స్థానిక నాయిడివాడ రాంరావ్‌బాగ్‌లో ఆర్యసమాజ్ మందిరం ఉంది. దీని కేంద్రంగా సమరయోధులు పోరాటాలకు రూపకల్పన చేసేవారు. నైజాం, ఆంగ్లేయుల అణచివేతలో భాగంగా ఎంతోమంది సమరయోధులు నెలల తరబడి జైళ్లకు వెళ్లారు. ఇక్కడి నుంచి వీరిని మహారాష్ట్రలోని నాందేడ్, చంద్రాపూర్, ఔరంగాబాద్ తదితర దూర ప్రాంత జైళ్లకు పంపించేవారు.
ఇలాంటి నిర్బంధాలను ఎన్నో ఎదుర్కొన్నా వెరువకుండా తమ పోరు సాగించారు. అప్పట్లోనే తమ వద్ద చిన్న పిస్టళ్లను, మందుగుండును వెంట ఉంచుకునేవారు. దేశానికి 1947 ఆగస్టు 15నే స్వాతంత్య్రం సిద్ధించినా నిజాం పాలనలోనే మన ప్రాంత చీకట్లు మాత్రం తొలగలేదు. ఈ దశలో ఓవైపు రజాకార్ల దౌర్జన్యాలూ పెరిగిపోయాయి. వారిని ఎదుర్కొంటూ స్వాతంత్య్రం వచ్చే వరకు ఆనాటి మన సమరయోధులు అసమాన పోరు సల్పారు. వారి పోరాటాలకు గుర్తుగా జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వారి పేర్లతో స్తూపాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లా ఏర్పడిన తర్వాత తొలి వేడుక
ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గతేడాది దసరా పండుగ(అక్టోబర్ 11) రోజున నిర్మల్ నూతన జిల్లాగా ఏర్పడింది. గతంలో నిర్మల్ రెవెన్యూ డివిజన్‌లో ఉన్న 13 మండలాలతో పాటు నూతనంగా ఏర్పడ్డ బాసర, నర్సాపూర్(జి), నిర్మల్ రూరల్, సోన్, పెంబి, దస్తూరాబాద్‌లతో కలిపి మొత్తం 19 మండలాలతో జిల్లా ఆవిర్భవించింది. ఈ ఏడాది జనవరి 26న జిల్లా తొలి గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ ఇలంబరిది తొలిసారి జెండాను ఎగురవేశారు. ఇప్పుడు నూతన జిల్లా ఆగస్టు 15న తొలి పంద్రాగస్టు పండుగను జరుపుకోనుంది.
ఏర్పాట్లు పూర్తి
తొలి స్వాతంత్య్ర దిన వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో వేడుకకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. మైదానంలో రంగుల జెండాలతో పాటు వేదిక, అధికారులు, అతిథులు కూర్చునే గ్యాలరీలనూ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. పోలీసులు పరేడ్ చేసేందుకు కావల్సిన లైనింగ్స్ వేశారు. ఇక వివిధ శాఖల శకటాల ప్రదర్శన కోసం వాహనాలను ముస్తాబు చేశారు. జిల్లాకేంద్రంలో తొలి స్వాతంత్ర దినోత్సవ జెండాను రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎగురవేయనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు.
ఫస్టు.. పంద్రాగస్టు
Published Tue, Aug 15 2017 1:26 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement