శోకసంద్రమైన కలు‘గోడు’ | five dies of light stroke | Sakshi
Sakshi News home page

శోకసంద్రమైన కలు‘గోడు’

Published Sun, May 14 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

శోకసంద్రమైన కలు‘గోడు’

శోకసంద్రమైన కలు‘గోడు’

పిడుగుపాటుకు ఐదుగురు మృతి
మరో ఆరుగురికి తప్పిన ప్రమాదం


రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కిన గుమ్మఘట్ట మండలంలో ఆదివారం వర్షం కురిసింది. వ్యవసాయ పనులు, పశువుల మేపునకు వెళ్లిన వారంతా చెట్టు చాటుకు చేరి.. ఇక తమ కష్టాలు తీరబోతున్నాయని సంబరపడ్డారు. అయితే వారి ఆనందాన్ని ఆవిరిచేస్తూ పిడుగుపాటు వారి జీవితాలను కబళించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.
 - గుమ్మఘట్ట (రాయదుర్గం)

కలుగోడుకు చెందిన గొల్లపల్లి ఓబన్న, జయణ్ణతో పాటు బీటీ బొమ్మయ్య, నజ్‌బూన్‌బీలు మేకలు, పశువులు మేపేందుకు గ్రామ చెరువు సమీపానకు వెళ్లారు. అప్పటిదాకా భానుడి భగభగలు తట్టుకోలేకపోయిన వారు ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో చినుకులు మొదలు కావడంతో పశువులు, గొర్రెలు, మేకలు తొలుకుని ఇంటి ముఖం పట్టారు. కాసింత దూరం రాగానే కళ్లు తెరవలేనంతగా గాలి, వాన ప్రారంభమైంది. ఆ పక్కనే ఉన్న రాయదుర్గం తిప్పేస్వామి పొలం వద్ద ఏర్పాటు చేసిన గోడచాటు సిమెంట్‌ రేకుల(షెడ్డు)లోకి వెళ్లి తలదాచుకున్నారు.

తాపీమేస్త్రీగా పని చేసే కరీమ్‌సాబ్‌ తోటి స్నేహితుడు రుద్ర, చిన్నాన్న కుమారుడు జెబీ, అన్న కుమారుడు దాదుతో కలసి అదే పొలం వద్దనున్న వ్యవసాయ బోరువద్దకు స్నానం కోసం వెళ్లారు. గాలి, వాన హోరు చూసి వారుకూడా అక్కడికే చేరారు. కంతార్లపల్లి గిరిరెడ్డి ఇటీవల మృతి చెందిన వదిన సరస్వతి సమాధికి గుట్టకట్టేందు కోసం చెరువు సమీపాన సున్నపు రాయి (కంకర) ఏరేందుకు గుంతలో మల్లేసి, సొట్టకాళ్లప్ప గారి వెంకటేశులుతో వెళ్లాడు. ఈ మగ్గురు కూడా రేకుల చప్పరం కిందకే చేరారు. ఎంబీఏ విద్యార్థి బోయ శివప్ప పక్క పొలంలో రాగులు కుప్ప చేస్తూ వర్షం చూసి వారి వద్దకు వెళ్లాడు. ఇలా మొత్తం పది మంది ఒకేచోటకు చేరారు.

అంతా నిమిషాల వ్యవధిలోనే..
వర్షం కురిస్తే చాలని మాట్లాడుతుండగానే రేకులకు ఆనుకుని ఉన్న వేపమానుపై భీకర శబ్ధంతో పిడుగు పడింది. దీంతో అక్కడున్న పది మంది కుప్పకూలిపోయారు. వీరిలో మొదటగా పోస్టు రుద్ర, జెబీ అనే ఇద్దరు స్నేహితులకు స్పృహ వచ్చింది. వారు ఒకరి కొకరు అలింగనం చేసుకుని గట్టిగా ఏడ్చారు. ఆ తరువాత మిగిలిన వారందరినీ అటు ఇటు ప్లొరిస్తూ..అరచి లేపినా పలకలేదు. పది నిమిషాల తరువాత మరో ముగ్గురు లేవగా.. మిగిలిన ఐదుగురు గొల్లపల్లి ఓబన్న (38), అంపణ్ణగారి జయణ్ణ (58), కరీమ్‌సాబ్‌ (32), కంతార్లపల్లి గిరిరెడ్డి (38), బోయ శివప్ప (25) ప్రాణాలు వదిలారు. గ్రామంలోకి పరుగున వచ్చి విషయాన్ని తెలియజేశారు. ఆర్డీఓ రామారావు, తహసీల్ధార్‌ అఫ్జల్‌ఖాన్, వైద్యాధికారి రమేష్, సీఐ చలపతిలు సంఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. పిడుగు పడడంతోనే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ఐదుగురు మృతితో కలుగోడులో విషాదం చోటు చేసుకుంది. దేవుడా తమ బతుకులు ఇలా ఆర్పావా అంటూ మృతుల కుటుంబ సభ్యులు రోదించడం అందరినీ కలచివేసింది.
 
మృతులంతా నిరుపేదలే..
పిడుగుపాటు మృతులు ఐదుగురూ నిరుపేదలే. గొల్లపల్లి ఓబన్నకు భార్య పార్వతితో పాటు నాగరాజు, మారుతి అనే చిన్న పిల్లలు ఉన్నారు. మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యా, పిల్లలు అనాథలయ్యారు.
- అంపణ్ణగారి జయణ్ణకు భార్య గిరిజమ్మ తో పాటు కుమారుడు హంపణ్ణ ఉన్నాడు. ఇతను బతుకు తెరవు కోసం భార్యతో కలసి బెంగళూరుకు వెళ్లగా, ఇంటివద్ద ఉన్న పశువులను మేపుతూ కూలి పనుల వల్ల జీవనం సాగించేవాడు.
-  కరీమ్‌సామ్‌ తాపీమేస్త్రీ. భార్య జబీనాబీతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. అత్యంత నిరుపేద. కనీసం ఇల్లు కూడా లేదు. అన్న ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు.
- కంతార్లపల్లి గిరిరెడ్డికి రెండెకరాల పొలం ఉంది. నీళ్లులేక బీడుపెట్టి బతుకుదెరువు కోసం బెంగళూరుకు కూలి పనికోసం వెళ్లేవాడు. ఇతడికి భార్య లక్ష్మితో పాటు ప్రవీణ్, సంధ్య అనే ఇద్దరు ఇంటర్‌ చదువుతున్న పిల్లలు ఉన్నారు. తండ్రి మరణంతో వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
- బోయ శివప్ప ఇటీవల ఎంబీఏ పూర్తి చేశాడు. ఉద్యోగం సాధిస్తాడనుకున్న కుమారుడు పిడుగు రూపంలో కుప్పకూలి పోవడంతో కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.  

మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
పిడుగుపాటుకు గురైన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీపీ పాలయ్య, మాజీ ఎంపీపీలు రాఘవరెడ్డి, గిరిమల్లప్ప, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మహేష్‌లు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి ఆస్పత్రికి వచ్చి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ నరకం ఎవరికీ వద్దు
అప్పటిదాకా ఆనందంగా గడిపాం. వర్షం వస్తే పశువులకు గడ్డి కష్టాలు కూడా తీరుతాయి, మూగజీవాలకు కొద్దో గొప్పో తాగేందుకు నీరుకూడా లభిస్తుందనుకున్నాం. ఇంతలోనే ఆదేవుడు మాపై పగపట్టినట్టు పిడుగు రూపంలో కకావికలం చేశాడు. మేము ప్రాణాలతో బయటపడి ఊపిరిపీల్చుకున్నాం. తోటి వ్యక్తులు ప్రాణాలు వదిలారు. ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాం. ఇటువంటి నరకం ఎవరికీ రాకూడదు.
- పోస్టు రుద్ర, జెబీ, ప్రత్యక్ష సాక్షులు, కలుగోడు

రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు పిడుగు పాటుతో మృతి చెందడం అత్యంత బాధకరం. తీరనిలోటు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం. మృతులంతా పేదలు కావడంతో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. గాయపడ్డ వారికి రూ.5 లక్షల పరిహారం అందించాలి.
- కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement