పాదగయ ఫ్లోరింగ్ పనుల పరిశీలన
-
మిగిలిన బిల్లులు నిలిపివేస్తామన్న పర్యాటక శాఖ అధికారులు
పిఠాపురం :
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రంలో నిర్మించిన గ్రానైట్ ఫ్లోరింగ్ పనుల్లో రూ.లక్షలు మెక్కిందెవరో తేలుస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ‘మూడు నెలలకే ముక్కలు.. రూ.లక్షలు మెక్కుడు’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన వార్తకు పర్యాటక శాఖ అధికారులు స్పందించారు. ఆ శాఖ డీఈ సత్యనారాయణ తన సిబ్బందితో ఆయా పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదని, మిగిలి ఉన్న బిల్లులు నిలిపివేస్తామని చెప్పారు. పూర్తిగా విచారణ జరిపి, అవినీతి జరిగినట్టు తేలితే.. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోపభూయిష్టంగా, ఇష్టానుసారం పనులు చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, ఆలయంలో ఏ పనినీ ఆ కాంట్రాక్టర్‌కు అప్పగించరాదని ఆలయ ఈఓ చందక దారబాబు పర్యాటక శాఖ అధికారులకు సూచించారు.
ఆ పనులు అసంతృప్తిగా ఉన్నాయి
గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు అసంతృప్తిగానే ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ పేర్కొన్నారు. ఆయన ఫ్లోరింగ్ పనులను పరిశీలించి, వెంటనే దీనిపై విచారణ జరిపించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.