మన ఇల్లు.. మన నేల | Weather Friendly Flooring Designiner Tripura Sundari Interview | Sakshi
Sakshi News home page

మన ఇల్లు.. మన నేల

Published Sat, Jan 18 2020 8:48 AM | Last Updated on Sat, Jan 18 2020 8:48 AM

Weather Friendly Flooring Designiner Tripura Sundari Interview - Sakshi

‘కొత్తదనం కోసం నేల విడిచి సాము చేయడం కాదు, నేల మీదనే ప్రయోగాలు చేయాలి’ అని నిరూపిస్తోంది త్రిపురసుందరి. తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. తర్వాత ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ సిటీ యూనివర్సిటీలో కొంతకాలంపాటు అధ్యయనం చేసింది. ‘అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌ ఇన్‌ ఫ్రాన్స్‌’ లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆ తర్వాత 2011లో ఇండియాకి తిరిగి వచ్చి కెరీర్‌ను ప్రారంభించింది త్రిపుర సుందరి. 

ఇంత చదివిన తర్వాత, ఇన్ని దేశాల్లో నిర్మాణశైలిని ఆకళింపు చేసుకున్న తర్వాత ఆర్కిటెక్చర్‌లో తనదైన శైలిలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంది త్రిపుర సుందరి. ఆ కొత్తదనానికి మూలం కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఆమె అన్వేషణ కేరళలోని తన పూర్వీకుల స్వస్థలంలో ఫలించింది.  
 

ఒకప్పటి ఎర్ర నేల
నిర్మాణాలలో సిరామిక్‌ టైల్స్, విట్రిఫైడ్‌ టైల్స్, మార్బుల్‌ ఫ్లోరింగ్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అంతకంటే కొత్తగా ఏదైనా చేయాలనే త్రిపుర సుందరి మెదడులో ‘వెదర్‌ ఫ్రెండ్లీ ఫ్లోర్‌’ అనే ఆలోచన మెదలింది. ‘‘కేరళలో పాత ఇళ్లలో ఎర్రటి ఆక్సైడ్‌ ఫ్లోరింగ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా ఆ నేల మీద నడిచినప్పుడు కలిగిన హాయిని మాటల్లో చెప్పలేను. ఆ ఫ్లోరింగ్‌ గాలిని పీల్చుకుంటుంది. వాతావరణానికి అనువుగా ఉష్ణోగ్రతలను మార్చుకుంటుంది. అందుకే నా ప్రయోగాలకు ఆక్సైడ్‌ ఫ్లోరింగ్‌నే ఎంచుకున్నాను’’ అంటుంది త్రిపుర సుందరి.

ఫ్లోరింగ్‌కి కలరింగ్‌
‘‘అప్పట్లో అందరూ రెడ్‌ ఆక్సైడ్‌ మాత్రమే వాడేవాళ్లు. దాంతో అన్ని ఇళ్లకూ ఎర్ర ఫ్లోరింగే ఉండేది. ఇప్పుడు నేను ఇంటీరియర్‌కు తగినట్లుగా ఆక్సైడ్‌ ఫ్లోరింగ్‌లోనే రంగులు మార్చగలుగుతున్నాను. ‘నామ్‌ వీడు నామ్‌ ఊర్‌ నామ్‌ కాధై’ (మన ఇల్లు.. మన ఊరు.. మన కథ) కాన్సెప్ట్‌తో నేను డిజైన్‌ చేస్తున్న ఆర్కిటెక్చర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పర్యావరణ హితమైనది మాత్రమే కాదు, రోజు వారీ వాడకంలో ఫ్లోర్‌ను శుభ్రపరచడానికి రసాయనాల అవసరమే ఉండదు. నగరాల్లో గృహిణులకు ఎక్కువవుతున్న కెమికల్‌ అలర్జీలకు ఈ ఫ్లోరింగ్‌ మంచి పరిష్కారం కూడా’’ అంటోంది త్రిపుర సుందరి. మార్బుల్‌ బాట పట్టిన ఫ్యాషన్‌ ట్రెండ్‌ వల్ల ఎర్రనేల ఫ్లోరింగ్‌ తగ్గుముఖం పట్టి దాదాపుగా ముప్పై ఏళ్లవుతోంది. అంటే ఒక తరం అన్నమాట. ఈ ఫ్లోరింగ్‌ పని చేసే వాళ్ల తరం అంతరించడానికి దగ్గరగా ఉంది. ఇప్పుడిక మిగిలి ఉన్న వారి అనుభవంతో కొత్త తరాన్ని తయారు చేయడానికి సిద్ధమైంది త్రిపుర సుందరి.


కలరింగ్‌ వేసిన ఫ్లోరింగ్‌త్రిపుర సుందరి, ఆర్కిటెక్ట్‌

మనసుతో చేసే పని
మేము ఉదయ్‌పూర్‌లో ఒక ప్రాజెక్టు చేస్తున్నప్పుడు మా దగ్గర పని చేస్తున్న ఒక వృత్తికారుడి తండ్రి పోయినట్లు ఫోన్‌ వచ్చింది. అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఫ్లయిట్‌ టికెట్‌ బుక్‌ చేసి వాళ్ల ఊరికి వెళ్లడానికి ఏర్పాట్లు చేశాం. అయితే అతడు పని వదిలేసి వెళ్లడానికి ఇష్టపడలేదు. ‘మా నాన్న కూడా ఇదే పని చేసేవాడు. ఆయన ఎప్పుడూ పనిని సగంలో వదిలిపెట్టలేదు. నేనిప్పుడు పని వదిలేసి మా ఊరికి వెళ్లడం కంటే, ఈ పనిని పూర్తి చేసి వెళితేనే ఆయన ఆత్మకు నేను శాంతిని ఇవ్వగలుగుతాను’ అన్నాడు. వృత్తికారులు అంతటి అంకితభావంతో పని చేస్తారు. మేము పని చేసేది మనసు లేని ఇసుక– సిమెంటులతో కాదు, మనసున్న మనుషులతోనని నాకు ఆ క్షణంలో అనిపించింది
– త్రిపుర సుందరి, ఆర్కిటెక్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement