ఉపాధికి ఊతం
-
మత్స్యకారులకు మంచిరోజులు..
-
జిల్లాలో 4.44 కోట్ల చేప పిల్లల పెంపకం లక్ష్యం
-
మాదన్నపేట చెరువులో నేడు ప్రారంభం
నర్సంపేట: జిల్లాలో మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నీలి విప్లవానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతోంది. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని మధ్య, చిన్న, తరహా జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి కార్యాచరణ పూర్తి చేసింది.
జిల్లాలో 16 రిజర్వాయర్‌లతోపాటు 715 చెరువులు, గ్రామపంచాయతీలకు సంబంధించిన కుంటలు, చెరువులో మరో 3600 ఉన్నాయి. వీటిలో 4 కోట్ల 44 లక్షల 38 వేల చేప పిల్లలు పెంచనున్నారు. జిల్లాలో ప్రథమంగా బుధవారం(నేడు) నర్సంపేటలోని మాధన్నపేట చెరువులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్ చేప పిల్లలు వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని 715 సంఘాలకు చేప పిల్లల్ని ఉచితంగా సరఫరా చేయనున్నారు. చేపల పెంపకం, మత్స్యకారులకు ఉపాధి, మార్కెటింగ్ తదితర అవసరాలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య కార్మికులకు రాయతీపై వలలు, వాహనాలను అందజేయనున్నారు. జిల్లాలోని జలాశయాల కింద స్థలాల్లో చేపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం మత్స్యశాఖ అ«ధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులను ఆదుకునేందుకు చేపల ఉత్పత్తి, పెంపకం కేంద్రాలకు అనువైన జలాశయాలు ఎంపికలో అ«ధికారులు నిమగ్నమయ్యారు.
73 వేల మందికి ఉపాధి మెరుగు ...
జిల్లాలోని 650 సహకార సంఘాలు ఉండగా 84 మహిళా మత్స్యకార్మిక సంఘాలు ఉన్నాయి. వీటిలోని 73 వేల మంది ఉపాధి పొందనున్నారు. ఇందులో సహకార సంఘాలలో 53 వేల మందికి సభ్యత్వాలు ఉండగా, మరో 20 వేల మంది అనధికారికంగా ఉపాధి పొందనున్నారు. ప్రభుత్వం చేపట్టనున్న నీలి విప్లవం ద్వారా వీరందరికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడటంతో పాటు భద్రత చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారులను ఆదుకునేందుకు 75శాతం రాయితీలపై వాహనాలు, లైసెన్సులు ఉన్న మత్స్యకారులకు 50 శాతం రాయితీపై వలలు అందించనున్నారు.
దళారీ వ్యవస్థ నుంచి విముక్తి
- బుస్స మల్లేషం, మత్స్యపారిశ్రామిక సొసైటీ జిల్లా అధ్యక్షుడు
ఇప్పటి వరకు జిల్లాలో చాలాచోట్ల చేపల అమ్మకం వ్యవస్థను దళారులు కొనసాగిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదపడుతాయి. దళారీ వ్యవస్థ లేకుండా చేసేందుకు మత్స్యకారులకు రాయతీ అందించడంతోపాటు నిరంతరం శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.