
మాట్లాడుతున్న ఎంపీ అజ్మీర సీతారాంనాయక్
- ఎంపీ అజ్మీర సీతారాంనాయక్
గార్ల: దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల పోడు భూములపై అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం మానుకోవాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ హెచ్చరించారు. ఆదివారం గార్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 కంటే ముందు నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్లవద్దని అన్నారు. ఇటీవల కాలంలో పోడు భూములను ఆక్రమించుకుంటే ఆ భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చన్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటే∙వరకు అటవీ అధికారులు ఏం చేశారని, ఇప్పుడు నాటిన మొక్కలను ధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. మహబూబాబాద్ జిల్లాను గిరిజన జిల్లాగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి బీబీనగర్, వలిగొండ, తిరుమలగిరి మీదుగా తొర్రూరు మహబూబాబాద్, బయ్యారం, ఇల్లెందు, కొత్తగూడెం వరకు 225 కిలోమీటర్లు జాతీయ రహదారిగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలోని 5400 తండాల్లో 500 జనాభా కలిగిన1753 తండాలను రానున్న ఎన్నికల నాటికి గ్రామ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మంది బంజారాలు ఉన్నారని, 342 ఆర్టికల్ ప్రకారం సీరియల్ నంబర్ 29తో గిరిజనులు తమ పిల్లలకు లంబాడీస్‌తో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మాళోత్ వెంకట్‌లాల్, సర్పంచ్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, భూక్యా నాగేశ్వరరావు, ఎస్సై బి రాజు, జర్పుల భీముడునాయక్, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, హెచ్‌ఎం బి దేవసింగ్, వార్డెన్ ధనలక్ష్మి పాల్గొన్నారు.