
వెంకన్న మృతదేహం
టేకులపల్లి : అప్పుల బాధ తాళలేక ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోయగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకన్న(55) హమాలీ పనులు చేసుకుంటూ.. తనకున్న రెండెకరాల పొలం, ఎకరం చేనులో పంటలు సాగు చేస్తున్నాడు. పంటలపై పెట్టుబడి కోసం రూ.3లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఎస్సై తాటిపాముల సురేష్, ఏఎస్సై అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సర్పంచ్ పూనెం సురేందర్, సొసైటీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్‌రాజు సందర్శించారు.