మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి
హైదరాబాద్: గిరిజన కంఠం మూగబోయింది. పోడు భూములపై హక్కులు, గిరిపుత్రుల మనుగడ కోసం ఏర్పాటైన 1/70 చట్టం అమలు తదితర పోరాటాల్లో తనదైన పాత్రపోశించిన ఖమ్మంజిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన(45) ఇకలేరు. కిడ్నీ సంబంధిత వ్యాధికి గురై హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. మిత్రసేనకు భార్య పోలమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మిత్రసేన మృతితో ఆయన స్వగ్రామం సున్నంబట్టిలో విషాదఛాయలు అలముకన్నాయి.
గిరిజనులకు పోడు భూములపై హక్కును కల్పిస్తూ మహానేత వైఎస్సార్ హయాంలో రూపొందించిన అటవీహక్కు చట్టం, అటవీహక్కు పత్రాల పంపిణీని. సగానికిపైగా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించడంతో వగ్గెల మిత్రసేనది కీలకపాత్ర. ప్రజల మనిషిగా పేరున్న ఆయన స్వగ్రామం సున్నంబట్టికి సర్పంచ్ గా ఎన్నికవావడం ద్వారా తన రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం అశ్వాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గానూ పనిచేశారు. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2014లోనూ అదే స్థానం నుంచి పోటీచేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థి చేతిలో పరాజయంపొందారు. మిత్రసేన మృతికి పలువురు సంతాపం తెలిపారు.