బ్యాంకు అధికారులపై రైతుల ఆగ్రహం
ధర్మాజీగూడెం (లింగపాలెం) : మండలంలోని ధర్మాజీగూడెం ఎస్‌బీఐ వద్ద నగదుకోసం రైతులు, బ్యాంక్ అధికారుల మధ్య బుధవారం ఘర్షణ చోటుచేసుకుంది. సొమ్ములు తీసుకునేందుకు ఉదయం పెద్ద సంఖ్యలో వినియోగదారులు బ్యాంకుకు చేరుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు అధికారులు ఒక్కొక్కరికీ నాలుగు వేల చొప్పున నగదు అందజేశారు. ఈ క్రమంలో జనం బారులు తీరిన ఉన్నా అధికారులు బ్యాంకు గేటును మూయించారు. దీంతో బయట ఉన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు చేరుకున్నారు. బ్యాంక్ మేనేజరతో మాట్లాడి గేటు తీయించారు. దీంతో ఒక్కసారిగా లోనికి వెళ్లిన రైతులు మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. ఖాతాదారులను విస్మరించి సొమ్ములను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో బ్యాంకు అధికారులు, రైతులు మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. బ్యాంకులో అవకతవకలు జరగడం లేదని అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించుకోవాలని మేనేజర్ అన్నారు. సొమ్ములు కావాలని రైతులు పట్టుబట్టడంతో ఒక్కొక్కరికీ రూ.2 వేలు చొప్పున అందజేశారు. దీంతో గొడవ సర్దుమణిగింది.