పశుగణాభివృద్ధే లక్ష్యంగా దత్తత గ్రామాలు
Published Sat, Sep 3 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
పొదలాడ (రాజోలు) :
పశుగణాభివృద్ధి కోసం జిల్లాలో దత్తత గ్రామాలను ఎంపిక చేసినట్టు పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోనే తొలి దత్తత గ్రామంగా పొదలాడను ఎంపిక చేసిన సందర్భంగా స్థానిక రైతులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సర్పంచ్ రాయుడు భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సులో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అజోల్లా పెంపకం, హైడ్రోఫోనిక్స్, సుఫలం, సునంది, క్షీరసాగరం తదితర శాస్త్రీయ పద్ధతుల్లో పశువుల పెంచే విధానం, దాణామృతం తదితర అంశాల గురించి వివరించారు. పశుసంపదను పెంచే దిశగా దత్తత గ్రామాలు కీలక భూమిక పోషించే విధంగా కృషి చేయాలని పశువైద్యులకు సూచించారు. ప్రతి నెలా మొదటి శనివారాన్ని పశుసంవర్ధక దినోత్సవంగా పాటిస్తూ, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. అమలాపురం సహాయ సంచాలకులు విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత, మండల పశువైద్యాధికారి డాక్టర్ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, ఎంపీటీసీ కంబాల అరుణకుమారి పాల్గొన్నారు.
Advertisement