రేపటి నుంచి భీమవరంలో జాతీయస్థాయి నాటిక పోటీలు
భీమవరం : కళారంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఆదివారం నుంచి జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు నిర్వహించనున్నట్టు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరథి శ్రీనివాసరావ్, ప్రధాన కార్యదర్శి పోశింశెట్టి మురళీ శుక్రవారం విలేకరులకు తెలిపారు. స్థానిక పీఎస్‌ఎం గరల్స్ హైసూ్కల్లోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లోని యిర్రింకి గంగారామ్ కళాప్రాంగణంలో ఆదివారం రాత్రి 6.30 గంటలకు ప్రారంభ సభకు ఎంపీ తోట సీతా రామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా నటుడు, దర్శక, రచయిత ఎంఎస్ చౌదరి, నటుడు, దర్శకుడు, రచయిత లింగం సత్యనారాయణ, నృత్య కళాకారిణి జవ్వాది యామిని నర్సాంబికను సత్కరించనున్నట్టు తెలిపారు. మూడు రోజులు పాటు నిర్వహించే ఈ నాటిక పోటీల్లో 16న కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్(సికింద్రాబాద్) వారి ‘మళ్లీమొదలు పెట్టకండి’. జేఆర్‌కే థియేటర్స్(పెనుమలూరు) వారి ‘యథాప్రజా’ నాటికలు ప్రదర్శిస్తారు. 17న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక(వెనిగండ్ల) వారి ‘మధురస్వప్నం’, నాటకశాల(విజయనగరం) వారి ‘పండుగొచి్చంది’, అభ్యుదయ ఆర్ట్స్(విజయవాడ) వారి ‘ఉయ్యాల’, 18న డీఎల్ కాంతారావు సోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్(తెనాలి) వారి ‘దిష్టి బొమ్మలు’, శ్రీకృష్ణ తెలుగు థియేటర్స్ (న్యూఢిల్లీ) వారి ‘ఇంకెంత దూరం’ నాటికల ప్రదర్శన ఉంటుంది. 18 రాత్రి విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. అలాగే రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు పులఖండం నాగేశ్వరరావుకు దివంగత జవ్వాది సూర్యారావు స్మారక పురస్కారం అందించి సత్కరించనున్నట్టు చెప్పారు.