చవితికి ధరల విఘ్నం
చవితికి ధరల విఘ్నం
Published Fri, Aug 25 2017 12:06 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM
రెట్టింపైన పండ్లు, పూల ధర
భక్తులకు భారం
వర్షంతో వ్యాపారుల ఆందోళన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :
తెలుగు గడ్డపై విఘ్నాధిపతికి పూజలు చేయనివారెవరూ ఉండరు. ఇదే అదనుగా వ్యాపారులు పూలు, పండ్ల ధరలను రెట్టింపు చేసి విక్రయించారు. దీంతో వినాయక చవితి పూజలకు సిద్ధమౌతున్న ప్రజలు బెంబేలెత్తిపోయారు. సాధారణంగా వినాయక చవితికి ఇంటిలో పూజ చేసేందుకు స్వామి ప్రతిమ, పాలవెల్లి, గొడుగు, పండ్లు, పూలు అవసరం. వీటి ధరలు సాధారణ రోజులకు మించి చవితి సందర్భంగా పెంచేయడం వ్యాపారులు ఏటా చేసే పనే. ఐతే ఈ ఏడాది ఆ ధరలను రెట్టింపు చేసి విక్రయించారు. ఇది ప్రజలకు భారంగా పరిణమించింది.
హతాశులయ్యారు
రెండు రోజుల ముందు వరకూ అందుబాటులోనే ఉన్న వివిధ రకాల పండ్ల ధరలు బుధవారం కాస్త పెరగగా, గురువారం మరింతగా పెరిగాయి. పూజ కోసం వాటిని కొనుగోలు చేయడానికి మార్కెట్లోకి వచ్చిన ప్రజలు వాటి ధరలు విని హతాశులయ్యారు.
ధరలు ఇలా..
పండ్ల రకం మంగళవారం గురువారం
యాపిల్ (1) రూ. 30 రూ.50
దానిమ్మ (1) రూ. 8 నుంచి రూ.10 రూ. 15 నుంచి రూ. 20
ద్రాక్ష పావుకిలో రూ. 50 రూ. 70
బత్తాయి డజను రూ. 80 రూ.120 నుంచి రూ.150
జామ (2) రూ.10 రూ. 15
మొక్కజొన్న పొత్తు రూ. 5 రూ.8
పువ్వులు (పావుకేజీ)
మల్లెలు రూ.200 రూ.400
కనకాంబరాలు రూ.350 రూ.500
చామంతి రూ.120 రూ.150
బంతి రూ.80 రూ.120
పత్రి, పాలవెల్లి ధరలు ప్రియం
చవితిలో ముఖ్యపాత్ర పోషించే పత్రి, పాలవెల్లి వంటి వాటి ధరలు కూడా మరింత ప్రియంగా మారాయి. వినాయకుని మందిరం ఏర్పాటు చేసి అలంకరించే వెదురు పాలవెల్లి రూ.20, చెక్క పాలవెలి రూ.30 చొప్పున విక్రయించారు. గొడుగు రకాన్ని బట్టి రూ.10 నుంచి రూ.20 వరకూ అమ్మారు. పాలవెల్లికి అంలకరించే వెలగకాయ, మారేడు కాయ, నారింజ, సీతాఫలం వంటి కాయల ధరలూ భక్తులకు చుక్కల్ని చూపించాయి. దీంతో వినాయక చవితి పండుగకు కేవలం అలంకరణలకే దాదాపు రూ.1000 ఖర్చుపెట్టాల్సి వచ్చింది.
అకాల వర్షం
చవితి పండుగ సామగ్రి విక్రయించి ఆదాయం సమకూర్చుకుందామనుకున్న వ్యాపారులకు గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆందోళన కలిగించింది. వాతావరణ శాఖ 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించిందనే వార్త వారిని మరింత కంగారుపెట్టింది. సాయంత్రం 5 గంటల నుంచి తగ్గుముఖం పట్టడంతో వారికి కొంత ఊరట కలిగింది. అప్పటికే ప్రజలు గొడుగులు, రెయిన్‌కోట్లు, జర్కిన్లు వేసుకుని మార్కెట్‌లోకి రావడంతో వ్యాపారుల్లో ఆనందం వ్యక్తమైంది.
Advertisement