
సంఘీభావాలు... సంపూర్ణ మద్దతు
♦ జగన్ దీక్షకు వెల్లువెత్తిన జనం
♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సహా పలువురి సందర్శన
♦ అయిదో రోజుకు నిరవధిక దీక్ష
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు ప్రధాన వామపక్షమైన సీపీఎం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దీక్ష శనివారం నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు శిబిరాన్ని సందర్శించి జగన్‌కు తమ పార్టీ తరఫున సంఘీభావాన్ని తెలపడంతో పాటుగా ప్రత్యేక హోదా కావాల్సిన ఆవశ్యకతపై ఆవేశపూరితంగా ప్రసంగించారు. గత మూడు రోజుల మాదిరిగానే నాలుగో రోజున కూడా జనం వెల్లువెత్తారు.
వరుసగా నాలుగు రోజుల నుంచీ నిరాహారదీక్ష చేస్తున్న జగన్ నీరసించినట్లు కనిపించినా రోజంతా ప్రజల మధ్యనే గడిపారు. తండోపతండాలుగా తరలి వచ్చిన మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువతీయువకులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. జగన్‌ను చూడటానికి ఉదయం నుంచే బారులు తీరిన జనం రాత్రి వరకూ అదే ఒరవడిని కొనసాగించారు. కొన్ని ప్రాంతాల నుంచైతే డప్పులు, వాయిద్యాలు, నృత్యాలు చేసుకుంటూ శిబిరం వద్దకు తరలి వచ్చారు. ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, సీపీఎంకు అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.రాధాకృష్ణ, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జఫ్రుల్లా, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీవీకే శర్మ, ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు, ఏపీ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి జగన్‌ను కలిసి ఆయనకు తమ మద్దతును ప్రకటించారు. గుంటూరు జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు కె.నళినీకాంత్, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శాంతకుమార్, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి.వి.రమణ పెద్దఎత్తున తమ సభ్యులతో కలిసి వచ్చి జగన్‌ను కలుసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాము ధృఢంగా అభిప్రాయపడుతున్నామని, ఇందుకోసం జరిగే పోరాటానికి తాము మద్దతు నిస్తున్నామని తెలిపారు.