ఆటకు... సై!
కడప స్పోర్ట్స్ : కడప గడపలో 27వ సీనియర్ జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్–2017కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి 5 రోజుల పాటు క్రీడాపోటీలు నగరప్రజలను అలరించనున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి ఒక్కో టీం నుంచి బాలుర విభాగం నుంచి 15మంది, బాలికల విభాగం నుంచి 15 మంది చొప్పున ఈ పోటీలకు హాజరుకానున్నారు. టీం ఈవెంట్, రెగో విభాగం, డబుల్స్ విభాగాల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఆతిథ్య జట్టుతో పాటు గతేడాది విజేతలు, రన్నరప్‌లతో పాటు క్వార్టర్‌ఫైనల్ ఆడిన 8 జట్లకు మాత్రమే మూడు ఫార్మాట్లలో ఆడే వీలుంటుంది.
నగరానికి చేరుకున్న క్రీడాకారులు...
వివిధ రాష్ట్రాలకు చెందిన పలుజట్లు ఇప్పటికే కడప నగరానికి చేరుకున్నాయి. క్రీడాకారులు, కోచ్‌లు, అఫిషియల్స్‌కు రవాణ, భోజన సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సాయంత్రం పలు రాష్ట్రాల క్రీడాకారులు సాధన చేశారు.
నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం..
శుక్రవారం ఉదయం నుంచే టీం ఈవెంట్స్‌లో పోటీలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 3.30 గంటలకు జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్–2017ను లాంచనంగా కలెక్టర్ కె.వి. సత్యనారాయణ ప్రారంభించనున్నారు. వీరితో పాటు ఆలిండియా సెపక్‌తక్రా అసోసియేషన్ కార్యదర్శి యోగేంద్రసింగ్, ఏపీ సెపక్‌తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్, కార్యదర్శి శ్రీనివాసులు విచ్చేయనున్నారు.