
కనుల పండువగా గంధ మహోత్సవం
నెల్లూరు (బాలాజీనగర్): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలని మొక్కుకుంటూ నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రొట్టెలను మార్చుకున్నారు. దర్గాలో ప్రార్థనలు చేశారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకునే రొట్టెల పండుగకు వచ్చిన భక్తులకు, నగర ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని గతంలో తాము రొట్టెలను పట్టుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలని మొక్కుకున్నట్లు చెప్పారు. దర్గాలో పవిత్రమైన ఘట్టం గంధమహోత్సవం ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం ముగిసింది. దర్గాలోని 12 గుమ్మటాలకు గంధాన్ని లేపనం చేసి, ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులకు పంచిపెట్టారు. పండుగ చివరి రోజైన మంగళవారం భక్తులు మరింతమంది వచ్చే అవకాశముండటంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.