
తేజస్వి ప్రఖ్యకు 'గరుడ' అవార్డు
ఈనెల 21వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగే గరుడ నాటకోత్సవాల్లో ఈ అవార్డును అందజేయనున్నట్టు కళాపరిషత్ ప్రతినిధి నారాయణ తెలియజేశారు. ఏడేళ్లుగా బాలల నాటికల విభాగంలో మన్ననలు పొందుతున్న తేజస్వి ప్రఖ్యను గరుడతో సత్కరించనున్నట్టు వివరించారు. ఇటీవలే మచిలీపట్నంలోని సాంస్కృతిక సంస్థ స్వర్ణోత్సవాల్లో ఈ యువనర్తకి అవార్డును అందుకున్నారు.
ఏడేళ్ల వయసులోనే 16 గంటల నిరంతర కూచిపూడి నృత్యప్రదర్శన చేసిన ప్రఖ్య 570 ప్రదర్శనలు పూర్తి చేసింది. ఈమె స్థానిక జేఎంజే మహిళా కాలేజిలో బీఏ స్పెషల్ ఇంగ్లీష్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ బ్యానర్‌పై రానున్న నంది నాటికోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు 'పరమపదం' బాలికల నాటికను ఈమె సిద్ధం చేస్తోంది. పట్టణ కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు షేక్ జానిభాషా, ఎం.సత్యనారాయణశెట్టి, జేఎంజే కాలేజి ప్రిన్సిపాల్ సిస్టర్ మేరీ, నృత్యగురువు డాక్టర్ వేదాంతం దుర్గాభవాని ప్రఖ్య అవార్డుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.