శుభారంభం
శుభారంభం
Published Sat, Mar 18 2017 12:47 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
ఏలూరు సిటీ : భవిష్యత్‌కు మేలిమలుపుగా నిలిచే పదో తరగతి పరీక్షల కోలాహలం శుక్రవారం మొదలైంది. తొలి రోజు పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ మొదటి భాష పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 246 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయగా.. 49,331 మంది విద్యార్థులకు గాను 48,991 మంది హాజరయ్యారు. 340 మంది పరీక్ష రాయలేదు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేముందు ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. వారివెంట తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు రావడంతో పరీక్ష కేంద్రాలున్న ప్రాంతాలు కిటకిటలాడాయి. ఎండను సైతం లెక్కచేయకుండా వారంతా బయటే వేచివున్నారు.
మొక్కవోని దీక్షతో..
పలుచోట్ల దివ్యాంగులు పరీక్ష రాశారు. ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన తానాల దుర్గాభవానికి క్యాన్సర్ కారణంగా ఎడమ కాలిని తొలగించగా.. కృత్రిమ కాలు ధరించి ఉత్సాహంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకుని పరీక్ష రాసింది.
ఒక విద్యార్థి డిబార్
తొలి రోజు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఓ విద్యార్థి ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థి కాపీ కొడుతుండటాన్ని గమనించిన ఇన్విజిలేటర్ అతడిని అధికారులకు అప్పగించగా డిబార్ చేశారు.
మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు
జిల్లాలో పదో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీఈవో ఆర్‌ఎస్.గంగాభవాని చెప్పారు. విద్యార్థులెవరైనా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినా.. అందుకు ఇన్విజిలేటర్ సహకరించినా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. తొలి రోజు పరీక్షలకు 99.35 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు.
Advertisement