బాధితురాలు మెంటి సుజాత
రాజాం : నగర పంచాయతీ పరిధిలోని మెంటిపేట గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని అగంతుకుడు ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు పుస్తెల తాడు చోరీ చేశాడు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న ఇంటికి సంబంధించి వరండాలో మెంటి పోలమ్మ నిద్రపోగా ఇంట్లో మెంటి సుజాత నిద్రపోయింది.
సుజాత భర్త ధర్మారావు నైట్ డ్యూటీకి వెళ్లగా ధర్మారావు తండ్రి రామారావు ఆరు బయట నిద్రపోయాడు. దీనిని గుర్తించిన అగంతుకుడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ముందుగా వరండాలో నిద్రపోతున్న పోలమ్మ మెడలో ఉన్న తాడుని కట్ చేయగా అది పసుపుతాడు కావడంతో దానికి ఉన్న అర తులం పుస్తెలను తీసుకొన్నాడు. అనంతరం ఇంట్లో నిద్రిస్తున్న సుజాత మెడలో ఉన్న తులమున్నర బంగారు పుస్తెల తాడు చోరీ చేసి పరారయ్యాడు. ఇంతలో మెలుకువ రావడంతో దొంగ దొంగ అని అరవగా అప్పటికే దొంగ పరారైపోయాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలపగా బీట్ కానిస్టేబుళ్లు హుటాహుటిన వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం దొరకకపోవడంతో ఆదివారం ఉదయం సీఐ శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.