మెదక్‌: పట్టపగలే దారుణం..  | Married Women Brutally Murdered At Medak District | Sakshi

మెదక్‌: పట్టపగలే దారుణం.. 

Dec 25 2022 8:32 PM | Updated on Dec 25 2022 8:37 PM

Married Women Brutally Murdered At Medak District - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: పట్టపగలు ఇంట్లో చొరబడిన గుర్తు తెలియని దుండగులు మహిళ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. ఈ ఘటన శనివారం మెదక్‌ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

వెల్దుర్తి మండలం కలాన్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల వెంకటేశం, సుజాత (42) దంపతులు మెదక్‌లోని పెద్దబజార్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం ఉదయం కూరగాయలు అమ్మేందుకు భార్యభర్తలిద్దరూ వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో సుజాత ఇంటికి వెళ్లి వంటచేసి భోజనం తీసుకొని వస్తానంటూ వెళ్లింది. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా భార్య రాకపోగా, ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వడంలేదని వెంకటేశం ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సుజాతను చూసి భయాందోళనకు గురయ్యాడు.  స్థానికుల సహాయంతో వెంకటేశం మెదక్‌ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, ఎస్‌ఐ మల్లారెడ్డి, మెదక్‌ రూరల్‌ సీఐ విజయ్‌కుమార్, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్‌ రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు. దుండగులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మృతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. దుండగులు సుజాత మెడను కోసి, ముఖంపై కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. ఆమె మెడలోంచి మూడున్నర తులాల పుస్తెలతాడు, చెవి కమ్మలను దోచుకెళ్లారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement