
ఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న గుర్తుతెలియని యువతి
తూప్రాన్ (మెదక్): గుర్తుతెలియని యువతిని దుండగులు అతి కిరాతకంగా బండరాయితో తలపై మోది హత్య చేసేందుకు యత్నించిన సంఘటన తూప్రాన్ మండలంలోని 44వ జాతీయ రహదారిపై కరీంగూడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. దీనికి సంబంధించి సీఐ లింగేశ్వర్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన కరీంగూడకు సమీపంలో గుర్తుతెలియని సుమారు 20 ఏళ్ల వయసు ఉన్న యువతి గాయాలతో తీవ్ర రక్తస్రావమై పడి ఉండగా గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అనుమానాస్పద స్థితిలో యువతి రక్తపు మడుగులో పడి ఉంది.
ఆమె తలపై బండరాయితో మోదినట్లు ఉండడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. యువతి ఎవరనే విషయం తేలాల్సి ఉందన్నారు. యువతి తలపై గుర్తుతెలియని దుండగులు దారుణంగా బండరాయితో మోదినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. యువతిని ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ హత్యా యత్నానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళ యువతిని తీసుకువచ్చిన దుండగులు అత్యాచారానికి యత్నించగా ఆమె నిరాకరించడంతోనే బండరాయితో మోది ఉంటారని పలువురు భావిస్తున్నారు.
పోలీసులు మాత్రం యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పేర్కొంటున్నారు. మొత్తానికి యువతిని హత్య చేసేందుకు ఎవరు పాల్పడి ఉంటారనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లింగేశ్వర్‌రావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన యువతి సాయంత్రం కన్ను మూసిందన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9490617048 నంబర్‌కు ఫోన్ చేసి తూప్రాన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

చికిత్స పొందుతూ మృతి చెందిన యువతి
Comments
Please login to add a commentAdd a comment