ప్రజలను మభ్యపెడుతున్న సర్కారు | goverment failer | Sakshi
Sakshi News home page

ప్రజలను మభ్యపెడుతున్న సర్కారు

Published Wed, Aug 3 2016 10:34 PM | Last Updated on Tue, Oct 2 2018 4:06 PM

goverment failer

  • ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలం
  • టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ
  • జగిత్యాల అర్బన్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు వాపును బలుపని భ్రమపడుతున్నారన్నారు. బుధవారం జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్‌లో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రమణ మాట్లాడుతూ... దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లతోపాటు ఎన్నో హామీలిచ్చి ఓట్లు దండుకున్న టీఆర్‌ఎస్‌... అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల బతుకులతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పొట్టకొట్టేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు 123 జీవో తీసుకొచ్చారన్నారు. ఇక మామ అల్లుళ్ల ఆటలు సాగవని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామని అన్నారు. రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ నిధులు అందలేదని, వారి సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కనీసం ఎంసెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర విడుదల చేసిన కరువు సహాయక నిధులను రైతులకు నయా పైసా ఇవ్వలేదన్నారు.
    తనను అవినీతిపరుడని ఆరోపించడం హరీష్‌రావుకు తగదన్నారు. ప్రజల కోసమే టీడీపీ పనిచేస్తోందని, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బడుగు బలహీనవర్గాల ప్రజలు తమ వెంటే ఉంటారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.విజయరమణారావు మాట్లాడుతూ... జిల్లాలో రూ.2700 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు రైతులకు రూ.270 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. దీంతో రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చుకుని పంటలు వేసుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు రూపొందిస్తామన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బాలె శంకర్, కౌన్సిలర్లు వొల్లం మల్లేశం, లక్ష్మి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ జయశ్రీ, నాయకులు శివకేసరి బాబు, దయాల మల్లారెడ్డి, నవ్వోతు రవీందర్, సారంగాపూర్, రాయికల్‌ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement