అతడి అరెస్టుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో
సాక్షి, సిటీబ్యూరో: అర్షద్ మాలిక్... మంగళవారం వరంగల్ జైలు నుంచి అలా విడుదలై, ఇలా మళ్లీ ‘లోపలకు’ వెళ్లిపోయాడు. ఇతగాడిని మళ్లీ‘అరెస్టు చేయడం’ కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చింది. మళ్లీ ఎప్పుడు ‘బయటకు వస్తాడో’ చెప్పలేని పరిస్థితి. ఇంతకీ అసలు ఎవరీ అర్షద్ మాలిక్? అతడిపై ఉన్న కేసు ఏంటి? శిక్ష పూరై్తనా బయటకు ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానామే ఈ కథనం...
ఐఎస్‌ఐ ప్రోద్భలంతో భారత్‌కు...
అర్షద్ మహమూద్‌కు అలియాస్ అర్షద్ మాలిక్ అలియాస్ అర్షద్ కబీర్ అలియాస్ అచ్చీ అలియాస్ జీవ అనే మారుపేర్లూ ఉన్నాయి. పాకిస్థాన్‌లోని రహీమైఖర్‌ఖాన్ జిల్లా ఖాన్‌పూర్ ఇతడి స్వస్థలం. 2002 నవంబర్‌లో ఐఎస్‌ఐ అధికారులైన ఫీర్జీ, లియాఖత్ ఇతన్ని ఖాన్‌పూర్‌లోనే కలిసి తమ తరఫున భారత్‌లో పని చేయడానికి వెళ్లాలని కోరారు. అర్షద్ అంగీకరించడంతో రహీమైఖర్‌ఖాన్‌లో దాదాపు మూడు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. భారత ఆర్మీ యూనిట్లే టార్గెట్‌గా చేసుకొనే ఈ శిక్షణ మొత్తం ఇచ్చారు.
పాక్ టు భారత్ వయా బంగ్లా...
అర్షద్ మాలిక్‌కు భారత్ ఆర్మీలో ఉండే అధికారుల ర్యాంకులు, వారి విధులు, ఆర్మీ యూనిట్లు ఉన్న ప్రాంతాలు, కంప్యూటర్ ద్వారా మ్యాపుల అధ్యయనం, ఈ–మెయిల్ ద్వారా సంప్రదింపులు జరపడం తదితర అంశాలన్నీ నేర్పారు. శిక్షణ ముగిశాక పాకిస్థానీ పాస్‌పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ కలిసిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ప్రతినిధులు బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్‌రామ్‌పూర్ మీదుగా కోల్‌కతా పంపారు.
కోల్‌కతా, ముంబయిల్లో కొన్ని ప్రాంతాలను పరిశీలించి తర్వాత అదే ఏడాది మేలో తిరిగి ఢాకా వెళ్లాడు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఐఎస్‌ఐ నుంచి 2003 జూలైలో ఆదేశాలు అందడంతో అదే ఏడాది ఆగస్టులో భోపాల్ మీదుగా కోల్‌కతా చేరుకున్నాడు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ముత్యాల్‌బాగ్‌లో గది అద్దెకు తీసుకొని మకాం పెట్టాడు.
‘వైద్యం’ ముసుగులో గూఢచర్యం...
ముత్యాల్‌బాగ్‌లో వారికి అర్షద్ తాను వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినని, కోల్‌కతా నుంచి వచ్చానని చెప్పాడు. పగలంతా ఆర్మీ ప్రాంతాల్లో తిరిగి రాత్రి 10 గంటల తర్వాత కింగ్‌కోఠి అగర్వాల్ ఛాంబర్స్‌లోని హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా రక్షణ రహస్యాలను పాకిస్థాన్‌కు పంపేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. నగరంలో కొరియర్ సర్వీసు నిర్వహించే మిలింద్ ద్వారా పలుమార్లు అర్షద్‌కు వేల రూపాయలు అందాయని పోలీసులు అభియోగం మోపారు. 2004 మార్చి 9న సైబర్‌కేఫ్‌లో ఉన్న అర్షద్‌ను టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది.
ఐదేళ్లకు దోషిగా నిరూపణ...
అప్పట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతని వద్ద రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ ఫ్లాపీ, కెమెరా, ఆర్మీ లొకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్‌ల్లో ఉన్న ఆర్మీ లొకేషన్స్ స్కెచ్‌లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతని గదిలో బూట్లలో దాచి ఉంచిన మరో రూ.21 వేలు, అర్షద్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు పంపిన కొన్ని ఈ–మెయిల్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తొలుత అబిడ్స్ పోలీసుస్టేçÙన్‌లో నమోదైన ఈ కేసు ఆ తరవాత సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ అయింది. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు అర్షద్‌ను దోషిగా నిర్థారిస్తూ 2009 ఏప్రిల్‌లో 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో అర్షద్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ ఇతర ఖైదీలతో ఘర్షణ పడటంతో 2011లో విశాఖపట్నం జైలుకు మార్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జూన్ 7న వరంగల్ జైలుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అదే జైలులో ఉన్న అర్షద్ మాలిక్ శిక్షా కాలం జైలు నిబంధనల ప్రకారం మంగళవారంతో ముగిసింది.
ఓన్’ చేసుకోని పాకిస్థాన్...
అర్షద్ మాలిక్ పాకిస్థానీ కావడంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన బోగస్ పాస్‌పోర్ట్‌తో భారత్‌కు వచ్చారు. దీన్ని అతడి అరెస్టు సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇతడు పాస్‌పోర్ట్ లేని విదేశీయుడిగా మారిపోయాడు. ఇలాంటి వాళ్ల శిక్షాకాలం పూర్తయిన తర్వాత సైతం బయటకు పంపాలంటే ఆయా దేశాలు సదరు వ్యక్తి మా పౌరుడే అని అంగీకరించి, తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ కేసులో పాక్ అలా అంగీకరిస్తే ఐఎస్‌ఐ వ్యవహారాలు బహిర్గతమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశం అర్షద్‌ను ‘ఓన్’ చేసుకోకపోవడంతో తిరిగి జైలుకు తరలించారు. ఈ తరహాలో ఇప్పటికే సలీం జునైద్ అనే పాకిస్థానీ ఇక్కడే ఉండిపోయాడు.